నాగేశ్వర్‌రావుకు సుప్రీం అసాధారణ శిక్ష
న్యూఢిల్లీ: సిబిఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముజఫర్‌పుర్ వసతిగృహ అత్యాచారాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్‌కె శర్మను బదిలీ చేసి సిబిఐ అదనపు డైరెక్టర్ హోదాలో నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇది కోర్టు ధిక్కారం కాకపోతే మరేంటీ..? దీనికి శిక్ష పడాల్సిందే. నాగేశ్వరరావుకు రూ. లక్ష జరిమానా విధిస్తున్నాం. దీంతో పాటు ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి. కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు వెళ్లి కోర్టు గదిలో ఓ పక్కన కూర్చోండి’ అని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు తాను తప్పు చేశానని అంగీకరించిన నాగేశ్వరరావు క్షమాపణ కోరుతూ కోర్టులో నిన్న ప్రమాణపత్రాన్ని సమర్పించారు. ఆయన తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అయితే ఇందుకు ఆయన ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు కెకె వేణుగోపాల్ న్యాయస్థానానికి విన్నవించారు.