ప్రజాపక్షం/హైదరాబాద్: ఆర్‌టిసి నష్టాల్లో ఉందని అందువల్ల ప్రభుత్వం ఆర్‌టిసిని నడపలేమని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ఇటు ప్రజలను, అటు కోర్టును మోసం చేసే ప్రయత్నాల్లో భాగమేనని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ అన్నారు. ఆర్‌టిసికి తక్షణం చెల్లించాల్సిన రూ.2200 కోట్లుగా ప్రకటించడం కూడా మోసమేనన్నారు. లెక్కలు ఏమి చెప్పినా, ఎలా చెప్పినా, ఎలా చెప్పినా కెసిఆర్ మాటలు ఆర్‌టిసిని మూసివేయాలనే ఆలోచన చుట్టూ తిరుగుతున్నాయన్నారు. 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్న ఆర్‌టిసిని నడపలేని ప్రభుత్వం 70 వేల మంది పనిచేస్తున్న సింగరేణి బొగ్గుగనులను ఎలా నడపగలదో ఆలోచించాలన్నారు. అప్పుల్లో ఉన్న ఆర్‌టిసిని నడపలేని ప్రభుత్వం సుమారు లక్షా 50 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏ రకంగా నడపగలదో చెప్పాలన్నారు. ఆర్‌టిసిని నడపడానికి డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏకంగా వేతనాలు పెంచుతామని ఎన్‌జిఓ నాయకులకు ఏ విధంగా వాగ్దానం చేసిందన్నారు. రాష్రర్ట ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల ఎన్ని వేల కోట్లు అవసరమవుతాయో, ఆ డబ్బును లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో ఏ రకంగా సమకూర్చుతారో ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించాలని బోస్ డిమాండ్ చేశారు. ఆర్‌టిసిని కుట్రలతో ప్రైవేటుపరం చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ఆర్‌టిసిని యథాతథంగా ప్రభుత్వం నడుపలేనని చెప్పటం కుట్రలో భాగమని ద్వజమెత్తారు. ప్రభుత్వం ఆర్‌టిసిని నడపలేనని చేతులెత్తేస్తే నడపగలిగిన సమర్థవంతమైన మేధావులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని వారితో సంప్రదించి ఆర్‌టిసిని ప్రభుత్వ రంగంలో నడిపే బాధ్యత అలాంటి మేధావులకు అప్పజెప్పాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసిని ప్రభుత్వ రంగంలో నడిపే మార్గాలు అన్వేషించకుండా 50 వేల మంది కార్మిక కుటుంబాలను రోడ్డుపాలు చేయాలని కుట్రచేసినా, ప్రైవేటు పరం చేయాలని ఆలోచించినా తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని బోస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కోర్టును, ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్
RELATED ARTICLES