HomeNewsBreaking News‘కోరమాండల్‌' ప్రమాదంవిద్రోహ చర్యా?

‘కోరమాండల్‌’ ప్రమాదంవిద్రోహ చర్యా?

విచారణ ప్రారంభించిన సిబిఐ
ఘటనాస్థలంలో ఆరా…ఎఫ్‌ఐఆర్‌ నమోదు
సిగ్నలింగ్‌ వ్యవస్థ ధ్వంసం చేసింది ఖుర్దా రోడ్‌ డివిజన్‌ డిఆర్‌ఎం?
న్యూఢిల్లీ/బాలాసోర్‌ :
దేశ చరిత్రలో పెనువిషాద ఘటనగా నమోదైన ఒడిశా రైలు ప్రమాదంపై సిబిఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఒడిశా పోలీసులు కూడా ఎవరినీ వేలెత్తి చూపించకుండా ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సిబిఐ వెంట ఫోరెన్సిక్‌ బృందాలు కూడా ఉన్నాయి. ఖుర్దా రోడ్‌ విజన్‌ డిఆర్‌ఎం రింకేశ్‌ రాయ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో భౌతికంగా జోక్యం చేసుకుని చిన్నాభిన్నం చేశారని సందేహిస్తున్నారు. ఈ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో కుట్రకోణం బలంగా ఉండి ఉంటుందని రైల్వే అధికారులు నమ్ముతున్నారు. అందుకే సిబిఐ జోక్యం కోరినట్లు వారు చెప్పారు. రైల్వేమంత్రిత్వశాఖ చేసిన విజ్ఞప్తి, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి, భారత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తాము ఈ దర్యాప్తు ప్రారంభించినట్లు సిబిఐ ప్రతినిధి ఒకరు బహనాగ రైల్వే స్టేషన్‌ వద్ద మీడియాకు చెప్పారు. అని కోణాలలోనూ దర్యాప్తు కొనసాగిస్తామని ఆయన చెప్పారు. సిగ్నలింగ్‌ వ్యవస్థలో ఎవరో జోక్యం చేసుకుని చిన్నాభిన్నం చేసినట్లు కనిపిస్తోందని రైల్వేశాఖ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి కావడంతో రైల్వే శాఖ, కేంద్రం సిఫార్సు మేరకు కుట్ర కోణాన్ని ఛేదించుందుకు సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ అధికారులు మంగళవారం ఉదయం
బాలాసోర్‌జిల్లాలోని బహనాగ రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రమాదం సంభవించిన ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి రైల్వే అధికారులను, బహనాగ రైల్వేస్టేషన్‌ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ ఎస్‌.బి.మొహంతి, ఇతర సిగ్నలింగ్‌ సిబ్బందిని ప్రశ్నించారు. ఆ సమీపంలోని రైల్వే స్టేషన్లకు చెందన స్టేషన్‌ మాస్టర్లను కూడా ప్రశ్నించారు. ఒడిశా పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకూ సంపాదించిన సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాధారాలు చెదిరిపోకుండా భద్రంగా కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ చిన్నభిన్నమైందన్న విషయాన్ని గుర్తించినట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సిబిఐ బృందం వెంట రైల్వే ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. బహనాగ స్టేషన్‌ వద్ద కోరమాండల్‌ ప్రయాణించిన మెయిన్‌ లైన్‌ పట్టాలను అధికారులు పరిశీలించారు. అక్కడ లూప్‌ లైపులోకి ఉన్న మార్గాలను, లూప్‌లైన్‌ను, పరిసర భౌగోలిక పరిస్థితులను కూడా పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం 2.15 ప్రాంతంలో సిబిఐ అధికారులు కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాతే ఇక దర్యాప్తు వేగం పుంజుకుంటుంది. ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన తరువాతనే సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ దర్యాప్తులో రైల్వే ఉన్నతాధికారులు కూడా వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి అవసరమైన సాంకేతిక అంశాలను వివరిస్తున్నారు. రైలు గమనం, ప్రతి సెకనూ, నిమిషంలో ఎంత వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది? ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థలో ఉన్న అంశాలు వంటివన్నీ సిబిఐ అధికారులకు వివరించారు. రైళ్ళ ఉనికిని రాకపోకల నియమ నిబంధనలను ప్రధానంగా నిర్దేశించే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థను పనిగట్టుకుని ఎవరో మార్పులు చేర్పులు చేశారని అధికారులు గుర్తించారు. ఈనెల 3న ఐపిసి సెక్షన్‌ 337, 338, 304 ఎ (మరణాలు, నిర్లక్ష్యం) రైల్వే చట్టంలోని 34 (ఉమ్మడి ఉద్దేశం), 153 చట్టవిరుద్ధగా రైలుప్రయాణికులకు హానీ చేయడం), 154 175 (ప్రాణహాని తలపెట్టడం) సెక్షన్ల కింద రైల్వే పోలీసు అధికారులు నమోదు చేసిన కేసు రిజిస్టర్లను సిబిఐ స్వాధీనం చేసుకుంది. రెండు రైళ్ళు ఢీ కొట్టుకోవడం వల్ల ఎంతోమంది తీవ్రంగా గాయపడి మరణించారని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది మూడు రైళ్ళకుచెందిన బోగీలు ఒకదానిమీద మరొకటి పడి ప్రయాణికులు నలిగిపోయారని పేర్కొంది. అదేవిధంగా విద్యుదాఘాతం వల్ల కూడా ప్రయాణికులు మరణించారని పేర్కొంది. తాము ఈ కేసులో సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు చేశామని గడచిన ఆదివారంనాడే బహనాగ వద్ద రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పారు. రైల్వే బోర్డు సభ్యుడు ఒకరు (ఆపరేషన్‌, మేనేజ్‌మెంట్‌) సిబిఐ దర్యాప్తునకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఈనెల 4న లేఖ రాశారు. దీంతో సిబిఐ అధికారులు దర్యాప్తు నిమిత్తం ఒడిశా ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నారు. ఈ ప్రమాదంలో బెంగళూరు నుండి హౌరా వెళుతున్న సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ నుండి చెన్నై వెళుతున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లు గడచిన శుక్రవారం రాత్రి ఏడు గంటలకు బహనాగ రైల్వే స్టేషన్‌ వద్ద ఎదురు బదురూ తారపడ్డాయి. ఆ సమయంలో కోరమాండల్‌ 128 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ మెయిన్‌ లైన్‌లోంచి లూప్‌ లైన్‌ లోకి దూసుకుపోయింది. అక్కడ ఆగిఉన్న గూడ్సురైలుపై ఇంజన్‌ ఎక్కడంతో వెనక ఉన్న బోగీలు బోల్తాపడి పక్క లైన్‌ లోంచి వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌పై పడ్డాయి. దాంతో ఘోర ప్రమాదం సంభవించింది. తుది గణాంకాల ప్రకారం, ఈ ప్రమాదంలో 278 మంది మరణించినట్లు తేల్చారు. 1,100 మంది గాయపడ్డారని నిర్థారించారు. వివిధ రకాల సాకేంతిక పరికరాలు ఏ విధంగా పనిచేస్తాయో ఫోరెన్సిక్‌ బృందాలు స్టేషన్‌ మాస్టర్‌ను అడిగి తెలుసుకుని వివరాలు సేకరించాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments