టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ప్రజాపక్షం / హైదరాబాద్ కాంట్రాక్టులతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంపాదించిన ధన బలానికి మునుగోడు ప్రజల జనబలానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. ఉపఎన్నిక మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్నదన్నారు. వేలకోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో ప్రజలను పట్టించుకోకుండా ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి, నేడు ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. టిఆర్‌ఎస్ తరుపున మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కెటిఆర్, రాజగోపాల్ రెడ్డి ధన దాహం, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసమే ఉప ఎన్నిక వచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి టిఆర్‌ఎస్ కార్యకర్తలను కోరారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆయన ఒక అట్టర్ ప్లాఫ్ ఎంఎల్‌ఎ అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్‌రెడ్డి అని ఆయన విమర్శించారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల కోసం మాట్లాడిన ఎంఎల్‌ఎ రాజగోపాల్‌రెడ్డి అని కెటిఆర్‌ఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కదాన్ని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్ రెడ్డి, ఈ ఉప ఎన్నిక సందర్భంగా మరోసారి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బిజెపి ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమీషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. ఇంకో సంవత్సరం పాటు పదవి కాలం ఉన్నా, ఉప ఎన్నిక స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నిక తెచ్చారని, అయితే చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బిజెపికి రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కెటిఆర్ చెప్పారు. ఒకవైపు బిజెపి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టు వ్యవహారాన్ని, ఆయన విఫలం అయిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూనే టిఆర్‌ఎస్ పార్టీ గత ఎనిమిది సంవత్సరాలు రాష్ర్ట అభివద్ధికి ప్రజల సంక్షేమానికి చేసిన కార్యక్రమాలను వివరించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అట్టర్‌ఫ్లాప్ ఎంఎల్‌ఎ
RELATED ARTICLES