హవాలా దందాకు చెక్ పడేనా..?
రాష్ట్రంలో సెంచరీ దాటిన నిర్వాహకులు
పదుల సంఖ్యలో పట్టుబడుతున్న కేసులు
అయినా దందా వదలని అక్రమార్కులు
రూ.లక్షకు రూ.600 కమీషన్
హైదరాబాద్ : రాష్ట్రంలో హవాలా దందాకు చెక్ పడేనా..? ప్రతి ఏటా పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నా.. తిరిగి యథేచ్ఛగా హవాలా దందా సాగుతునే ఉంది. ఇలా దశాబ్దాలు గడుస్తున్నా ఈ దందాకు చెక్ పెట్టే నాథుడే లేకుండా పోయాడు. కేసులు నమోదు కావడం, ఏజెంట్లు పట్టుబడడం ప్రతి ఏటా సాగుతున్న ఒక తంతుగానే మిగిలిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా హవాలా దందా నిర్వాహకులు ఉన్నట్లు అంచనా. సుమారు వెయ్యి మందికిపైగా ఏజెంట్లు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ హవాలా రాకెట్‌లో ఎక్కువగా గుజరాత్‌కు చెందిన బడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో రూ.50 కోట్లకుపైగా హవాలా వ్యాపారం నడుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ.18 వేల కోట్ల వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో పట్టుబడుతున్న డబ్బు మాత్రం కేవలం ఐదు శాతానికి మించడం లేదు. పట్టుబడిన డబ్బులు కూడా ఏదో ఒక వంకతో ఐటి అధికారుల నుంచి తిరిగి పొందుతున్నట్లు తెలిసింది. ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగా ఈ హవాలా వ్యాపారం నడుస్తుంది. మంగళవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రెండు కార్లలో తరలిస్తున్న రూ.5 కోట్ల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పట్టుబడిన సమయంలో పోలీసులు హడావిడి చేయడం తప్పిస్తే ఆ తరువాత ఈ వ్యాపారంపై దర్యాప్తు అధికారుల అంత ఆసక్తి కనబర్చరు. దీంతో ఏజెంట్లు తమ వ్యాపారాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు. పోలీసులు పట్టుకున్న ఇలాంటి డబ్బును ఐటి అధికారులకు అప్పగిస్తారు.
కోట్లకు కోట్లు నగదు అక్రమ రవాణా
RELATED ARTICLES