వచ్చే ఐదేళ్ళలో ప్రభుత్వ లక్ష్యం అదే
మహాలక్ష్మి స్వశక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్‌వచ్చే ఐదేళ్ళలో తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలలో 14 చోట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘మహిళా శక్తి’ పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు, వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పనకు తోడ్పడుతుందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం లక్ష మంది మహిళలతో జరిగిన మహిళా సదస్సులో ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ‘మహిళా శక్తి’ పాలసీ డాక్యూమెంట్‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి,సి.దామోదర రాజనర్సింహ్మా, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని, హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పరామంలో కూడా అవసరమైన స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అబద్ధాలు చెప్పి పదేళ్లు ఆడబిడ్డలను కెసిఆర్ మోసం చేశాడని సిఎం విమర్శించారు. మహిళల ఆర్థిక స్వావలంభనే లక్ష్యంగా మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాల బలోపేతం, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే మహిళా శక్తి పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాలను ఐఐటి, ఐఐఎం, ఎస్‌బిఐ, ఆర్‌ఎంఎతో అనుసంధానం చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మహిళా సంఘాల సూక్ష్మవ్యాపార ప్రణాళికల అధ్యయనం, రుణాల సిఫార్సుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.
గ్యాస్ ధర పెంచి ఆడబిడ్డలను దొచుకున్న కెసిఆర్, మోడీ..
గ్యాస్ ధర పెంచి కెసిఆర్, మోడీ ఆడబిడ్డల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. కెసిఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పు నా నెత్తిన పెట్టిపోయారన్నారు. సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తానంటూ కెసిఆర్ పదేళ్లు ఆశ చూపి మోసం చేశాడని ధ్వజమెత్తారు. కెసిఆర్, కెటిఆర్, కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అంటున్నారని, నేనంత పాపం ఏం చేశా అని ప్రశ్నించారు. మీ అవినీతి సొమ్ములో షేర్ అడిగానా? అని ప్రశ్నించారు. సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్ భరోసాతో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. కట్టెల పొయ్యితో మహిళలు పడుతున్న కష్టాలను చూసి సోనియాగాంధీ చలించిపోయారని, దీపం పథకం కింద రూ.1500లకే కొత్త గ్యాస్ కనెక్షన్‌లు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలని రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిందన్నారు. ఆడబిడ్డలకు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణం కల్పిస్తే, కెసిఆర్ కుటుంబానికి కడుపుమంటగా ఉందన్నారు. మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే, కెసిఆర్, హరీశ్ రావు, కవిత, కెటిఆర్ కిరాయి ఇచ్చి ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారని అన్నారు. ఎవరు అడ్డు వచ్చినా సరే, మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భద్రాద్రి రామచంద్ర స్వామి ఆశీస్సులతో ప్రారంభించిన ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ కింద పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పారు.
మాట తప్పుకుండా మడమ తిప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ధన్యవాదాలు అని రేవంత్ రెడ్డి అన్నారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలతో చలించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారన్నారు. కుటుంబసభ్యులను కోల్పోతే కలిగే బాధ ఏంటో సోనియాగాంధీకి తెలుసు అన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో మహిళా సంఘాలు దివాళా తీశాయన్నారు. అందుకే మా ఆడబిడ్డలు కంకణం కట్టుకుని ఎన్నికల్లో కెసిఆర్‌ను బండకేసి కొట్టారన్నారు.
ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చోవాలా?, రైతు బిడ్డ కూర్చో కూడదా?
ప్రభుత్వాన్ని పడగొడతామని కెసిఆర్ కుటుంబం ఫామ్‌హౌస్‌లో చిందులు వేస్తోందని, ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చోవాలా?, రైతు బిడ్డ కూర్చో కూడదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కెసిఆర్, మోడీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా వస్తే, మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మర్లేసి కొడతారన్నారు. ‘రానున్న కొద్ది రోజుల్లో 10 లక్షల ఆడబిడ్డలతో కవాతు చేస్తాం. మా సైన్యం మీరే. మా బలగం మీరే. వచ్చే ఐదేళ్లలో మా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వానిదే’ అని సిఎం అన్నారు.
మహిళలు తీసుకునే రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది: మల్లు భట్టివిక్రమార్క
మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తుందని, రానున్న ఐదు సంవత్సరాల పాటు మహిళలు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే వడ్డీ కడుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రతి మహిళా సంఘానికి వడ్డీ లేకుండా కోటి రూపాయల రుణాలను ఇప్పించబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 64 లక్షల మంది స్వయం సహాయక సంఘం సభ్యులకు రానున్న ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇప్పించాలని ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ 07 నుంచి మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదన్నారు. రుణాలు తీసుకున్న మహిళలలు దురదృష్టవశాత్తు మరణిస్తే చెల్లించాల్సిన రుణ భారాన్ని ఆ కుటుంబంపై మోపకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవించాలని అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని గుర్తు చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలను గౌరవించలేదని విమర్శించారు.
నాడు కవిత ఎందుకు మాట్లాడలేదు: కొండా సురేఖ
కెసిఆర్ పదేళ్లకాలంలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందించలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎంపి, ఎంఎల్‌సి పదవులతో పాటు బతుకమ్మ, బోనాలు ఏదీ అయిన కెసిఆర్ తన బిడ్డ కవితనే చేశారని విమర్శించారు. ఏ మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదని, నాడు కవిత ఎందుకు మాట్లాడలేదన్నారు.
మహిళల రక్షణ కోసం టి-సేఫ్ తీసుకొచ్చాం: సీతక్క
మహిళల రక్షణ కోసం తమ ప్రభుత్వం టి-సేఫ్ పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో మహిళలకు ఏ పథకం అమలు కాలేదన్నారు. మహిళ సంఘాల ద్వారా కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేస్తామన్నారు. మార్కెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామన్నారు. మహిళలను మహాలక్ష్ములను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం చేసిన 25 కోట్ల మహిళలు ఃమంత్రి పొన్నం ప్రభాకర్
మహిళల ఆశీర్వాదంతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్పు కోరుకున్నారని, మహిళలు మీరు ఓటేస్తేనే తాము అధికారంలోకి వచ్చామని, అందరికీ ధన్యవాదాలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చే పార్టీ అన్నారు.
రూ.లక్ష కోట్ల రుణాల అనుసంధానం
‘మహిళా శక్తి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి విజన్ డాక్యుమెంట్’ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులతో కలిసి ఆవిష్కరించారు. వచ్చే అయిదేళ్లలో మహిళలకు బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా ఎస్‌హెచ్‌జిలకు రూ.లక్ష కోట్ల రుణాలను అనుసంధానించడం, సంఘాలకు వడ్డీ లేని రుణాలు పునరుద్ధరించడం, సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్, సంఘాలకు శిక్షణ, సంఘాల సభ్యులకు రుణ బీమా, సంఘాల్లోని మహిళలకు రూ.10 లక్షల జీవిత బీమా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సంఘాలతో నిర్వహణ వంటి అంశాలు విజన్ డాక్యుమెంట్‌లో ఉన్నాయి.