ఇదొక నిర్ణయాత్మకమైన మేలి మలుపు
కరోనా విముక్తికి, ఆరోగ్యభారత్‌కు మార్గం సుగమం
ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు నా శాల్యూట్ :మోడీ ట్వీట్
కరోనాపై పోరు ఇక మరింత శక్తిమంతం : డబ్ల్యుహెచ్‌ఒ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు సిద్ధంచేసిన కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆదివారం నాడు ఆమోదముద్ర వేసింది. దీంతో కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు రాబోయే రోజుల్లో టీకా వినియోగానికి రంగం సిద్ధమైంది. టీకాలు డిసిజిఐ ఆమోదం పొందిన ఈ సందర్భాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక ‘నిర్ణయాత్మకమైన మలుపు’గా అభివర్ణించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ టీకాకు, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) సారథ్యంలో భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తయారు చేసిన ఈ కోవాగ్జిన్ టీకాలకు శుక్ర-శనివారాలలో జరిగిన వరుస సమావేశాలలో నిపుణుల కమిటీ (ఎస్‌ఇసి) నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల నివేదికను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఓ) డిసిజిఐకి సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన డ్రగ్స్ కంట్రోలర్ ఆదివారంనాడు కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ప్రజా వినియోగానికి వీలుగా అనుమతి పత్రాన్ని జారీ చేయాలని నిర్ణయించారు. కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా ఆమోదం తెలియజేసినట్లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ వి జి సోమాని ఆదివారంనాడు ఢిల్లీలో మీడియాకు తెలియజేశారు. కాగా, కరోనా వ్యతిరేక టీకా తయారీలో పోటీ పడుతున్న మరో సంస్థ కెడిలా హెల్త్‌కేర్ ఫార్మాకు దేశంలో మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు అనుమతి మంజూరు చేసినట్లు సోమాని తెలిపారు. కోవాగ్జిన్ టీకాపై ప్రస్తుతం ఇంకా మూడోదశ ప్రయోగాలు కొనసాగుతున్నందున రోగికి ఏ విధమైన ప్రత్నామ్నాయ ఔషధాలు పనిచేయనప్పుడు రోగి బంధువుల అనుమతితో కోవాగ్జిన్‌ను ఉపయోగించాలి. ఆస్ట్రాజెనికాతో ఒప్పందం చేసుకున్న ప్రపంచంలోని అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి చేస్తోంది. కాగా ఐసిఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ దేశీయంగా రూపొందించిన కోవాగ్జిన్ టీకా2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరిచే ఈ రెండిటిలో ఏ టీకానైనా నా రెండు విడతలుగా ఒక్కొక్కరికీ రెండు డోసులు ఇస్తారు. ‘కరోనామహమ్మారి నుంచి విముక్తి పొందడానికి, ఆరోగ్యవంతమైన జాతి నిర్మాణానికి ఈ శుభ సందర్భం దోహదపడుతుంది, భారత ప్రజలందరికీ శుభాభినందనలు, ఎంతో కష్టపడిన మన శాస్త్రవేత్తలకు, సరికొత్త ప్రయోగాలతో ఔషధం తయారు చేసిన శాస్త్రవేత్తలకు శుభాభినందనలు’ అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఎంతో ఆతృతతో దేశం ఎదురు చూస్తున్న ఆత్మనిర్భర్ భారత్ కలను మన శాస్త్రవేత్తల బృందం సాకారం చేసింది అంటూ కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్న కార్మికులందరికీ శాల్యూట్ చేశారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో సరైన సమయంలో వచ్చిన ఒక కీలకమైన మలుపుగా డ్రగ్ కంట్రోలర్ నిర్ణయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు. టీకాలకు ఆమోదముద్ర వేయడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఆహ్వానించింది. భారత ఉపఖండంలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని ఈ చర్య మరింత ఉధృతం చేయడంతోపాటు కరోనా వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. టీకా వేయడానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలకు అమలు చేస్తున్న పలు ఆరోగ్య సంరక్షణ చర్యలను కొనసాగించడంతోపాటు, కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు సమాజాన్ని భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా వ్యవహారాల ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ పూనం ఖెత్రపాల్ సింగ్ అన్నారు. భారతదేశ మొట్టమొదటి కరోనా నియంత్రణ టీకా కొవిషీల్డ్ ఎంతో సురక్షితంమైనదేకాదు, సమర్థవంతంగా పనిచేస్తుంది కూడా, రానున్న వారాల్లో ఈ టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం అని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ అడర్ పూనవల్ల ట్వీట్ చేశారు.
కొవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు డిసిజిఐ పచ్చజెండా
RELATED ARTICLES