కోదండరామ్ నిరసన దీక్షలో ప్రతిపక్షాలు
పరిపాలన చేతకాకపోతే సిఎం పదవి నుంచి దిగిపోవాలి : కోదండరామ్
ప్రజలను ఆదుకోకపోతే ఇక ప్రత్యక్ష ఆందోళన : చాడ
ప్రజాపక్షం/హైదరాబాద్: కొవిడ్ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, రాష్ట్రంలో జరిగే పరిణామాలకు సంపూర్ణ బాధ్యత ముఖ్యమంత్రిదేనని, ప్రభుత్వానికి కొనసాగే నైతి క అర్హత లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ విమర్శించారు. పరిపాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాలని డిమాండ్ చేశారు. కొవిడ్ నివారణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని టిజెఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కోదండరామ్ గురువారం నిరసనదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సిపిఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.గోవర్దన్, న్యూడెమోక్రసీ నాయకులు చలపతిరావు, పిఒడబ్ల్యు నాయకురాలు వి.సంధ్య, ఐఎఫ్‌టియు అనురాధ, శివసేన పార్టీ నాయకులు సుదర్శన్ తదితరులు సంఘీభావం వ్యక్తం చేశారు. కాగా కోదండరామ్‌కు ఎఐసిసి కార్యదర్శి ఎ.సంపత్‌కుమార్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ న్యాయాన్ని సాధించేందుకు పోరాటం మినహా మరో మార్గం లేదన్నారు. ఆర్థిక ప్యాకేజీ, ఆరోగ్య సంరక్షణ చర్యలకు ప్రతిపక్షాలన్నీ ఏకోన్మూఖంగా ఉద్యమించాలన్నారు. హైదరాబాద్ నుండే పోరాటా న్ని ఉధృతం చేస్తామన్నారు. కొవిడ్ నిబంధలనకు లోబడే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనుమానాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి, సరైన చికిత్స అందించాలని అనేక మార్లు మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ వనరులను కొవిడ్‌కే కేటాయించాలని, ప్రభుత్వం తన శక్తి యుక్తులను ఉపయోగించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో కోదండరామ్‌తో పాటు టిజెఎస్ నాయకులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్‌రావు, డాక్టర్ శంకర్, పంజగుల శ్రీశైల్‌రెడ్డి, ఎం.నర్సయ్యగౌడ్, పల్లె రవికుమార్, నిజ్జన రమేష్ ముదిరాజ్ కొత్తరవి పాల్గొన్నారు.
ప్రజలను ఆదుకోకపోతే ఇక ప్రత్యక్ష ఆందోళన- : చాడ వెంకట్‌రెడ్డి
ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ప్రత్యేక్ష ఆందోళనకు సిద్ధమవుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, ప్రతి భవన నిర్మాణ కార్మికునికి రూ. 5వేలు ఆర్థిక సహాయం చేసిందని, అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు డబ్బులు ఇచ్చిందా అని ప్రశ్నించారు. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడంతో అసలు రంగు బయటపడిందని, కేంద్రం, ప్రతిపక్షాల ఒత్తిడితో కొవిడ్ పరీక్షలు నిర్వహించిందని, తద్వారా 15 రోజుల్లోనే 10వేల వరకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్‌ల సంఖ్య పెరిగితే తెలంగాణ రాష్ట్ర కొంప మునిగినట్టుగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరచి, వాస్తవాలను గ్రహించి, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము వైద్యులను, సిబ్బందిని తప్పుపట్టడం లేదని, ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నామన్నారు. వైద్యులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలను కల్పించలేదన్నారు. ఈ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ తన ఆంతరాత్మతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హెల్త్ ఎమర్జెన్సీలో కూడా ఖాళీగా ఉన్న 20వేల వైద్య సిబ్బందిని ఎందుకు భర్తీ చేయలేదన్నారు. 1500 బెడ్స్‌తో గచ్చిబౌలిలో కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించి, వైద్యులను ఎందుకు నియమించలేదని, ఆస్పత్రిని ఎందుకు నిర్మించారు, ఎందుకు ఖాళీగా పెట్టారని ప్రశ్నించారు. ఇదే విషయమై తాను ఆరోగ్యశాఖ మంత్రిని అడిగితే సిబ్బంది లేరని సమాధానమిచ్చారని, ప్రజలు చనిపోతుంటే సిబ్బందిని కూడా నియమించుకోలేరా అని ధ్వజమెత్తారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలు కూడా దొరికే పరిస్థితి లేదని, దీనిపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి రూ. 7500 ఇవ్వాలని, పప్పులు, నూనెలు కూడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి అటవిలో అరణ్యరోధనగా మారిందని, అడవిలో ఉండే జంతువుకు మానవత్వం ఉండదని, జాలి, దయలు ఉండవని, అదే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షలు లేని ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. కరోనా వైరస్ నవంబర్ వరకు కొనసాగుతుందని సంకేతాలిచ్చిన ప్రధాని మోడీ, 80 కోట్ల ప్రజలకు 5 కిలోల బియ్యం, గోదుమలు, కిలో కందిపప్పు మాత్రమేనని ప్రకటించారని ఎద్దేవా చేశారు. పేదల పట్ల మోడీ ప్రభుత్వం కంటితుడుపుగానే ఆలోచిస్తోందని విమర్శించారు. రాష్ట్రాలకు నిధులను ఇవ్వాలని, ఎఫ్‌ఆర్‌బిఎం పెంచాలని, రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఇలా రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలని చాడవెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్.రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పరిపాలన చేసి పేదల బతుకులను ఛిద్రం చేయడం మంచిది కాదన్నారు. కొహెడ పండ్ల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా గాలికి ఎగిరిపోయాయని, కొండపోచమ్మ కాలువకు గండిపడిందని, ఈ పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉన్నదో అర్థమవుతోందని, నాణ్యత లేని పనులు నిర్వహిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమని ఆరోపించారు. ఒక వైపు రూ. 11వేల కోట్ల ఆదాయం, ఇంకో వైపు వేలా కోట్ల రూపాయాలు విరాళాలు వస్తున్నట్టుగా పత్రికల్లో ప్రచురితమవుతోందని దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొండపోచమ్మకు గండి పడినట్టే రానున్న రోజుల్లో కెసిఆర్ ప్రభుత్వానికి కూడా గండిపడుతుందని హెచ్చరించారు.