HomeNewsLatest Newsకొవిడ్‌  మెడికల్‌ టెస్టులు మరింత విస్తృతం చేయాలి

కొవిడ్‌  మెడికల్‌ టెస్టులు మరింత విస్తృతం చేయాలి

బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు లాగ్‌డౌన్‌ను పొడిగించడాన్ని సిపిఐ స్వాగతించింది.  ఇది మంచి పరిణామమే అయినా కొవిడ్‌ టెస్టులకు సంబంధించి మరింత విస్తృత స్థాయిలో టెస్టులు చేయించే పరిస్థితి ఉంటే బాగుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. విజయా డయాగ్నొస్టిక్‌ వంటి అనేక డయాగ్నొస్టిక్‌ సెంటర్లు రాష్ట్రంలో ఉన్నందున వారితో కూడా టెస్టులు చేయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా టెస్టులు చేయించినా మంచిదేనన్నారు. ఇంకా ఎక్కువ స్థాయిలో టెస్టులు నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి ఆ మేరకు ఆలోచించాలని సూచించారు. తెల్ల రేషన్‌కార్డులపై మే నెలకు కూడా బియ్యం, నగదు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని అయితే బియ్యంతో పాటు కందిపప్పు, నూనె, చక్కెర, చింతపండు వంటి నిత్యావసర సరుకులు అందిస్తే పేదలు ఆకలి తీర్చుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. రేషన్‌ కార్డులు లేని నిరుపేదలు రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది ఉన్నారని, వారికి ఎలాంటి సహాయం అందక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని,  వారికి కూడా నగదు, బియ్యాన్ని అందించాలని ఆయన కోరారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి పోయిందని , రైతుల పండించిన వరి ధాన్యాన్ని కొంత మంది రైస్‌ మిల్లర్లు  హమాలీలు లేరనే సాకుతో కొనుగోలు చేయడం లేదని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్ళపై విజిలెన్స్‌లాగా ఒక ఐఎఎస్‌ అధికారిని నియమించి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బత్తాయి, మామిడి,జామ వంటి పండ్లు ఎక్కువ కాలం నిల్వ చేయడం సాధ్యం కాదని, వానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మార్కెటింగ్‌ వసతి కల్పించి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వలస కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని తినడానికి తిండి లేకుండా, చేయడానికి పనిలేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించే విధంగా రాష్ట్రంలో ఉన్న  కార్మికులను  వారి ప్రాంతాలకు చేరవేసే విధంగా రవాణా సౌకర్యం కల్పించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గద్వాల జిల్లా కు చెందిన బుడగజంగాలు కొంత మంది లక్నోలో చిక్కుకున్నట్లు తెలుస్తోందని వారిని రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments