నిర్ణయం తీసుకునేలోగా థర్డ్‌వేవ్ కూడా ముగుస్తుంది
కేంద్ర సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: కొవిడ్ మృతుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారంతోపాటు మరణ ధ్రువీకరణ పత్రాల కోసం మార్గదర్శగాలను జారీ చేయడం లో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోగా కరోనా థర్డ్‌వేవ్ కూడా ముగుస్తుందని జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మండిపడింది. కొవిడ్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి, ఆయా కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయానికి సంబంధించిన ఏకీకృత విధానాన్ని కేంద్రం రూపొందించాలని ఇది వరకే సూచించిన విషయాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ దిశగా మార్గదర్శకాలను ఎందుకు రూపొందించలేదని కేంద్రాన్ని నిలదీసింది. సమీకృత విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా మార్గదర్శకాలను ఖరారు చేయడానికి ఇచ్చిన గడువును పలుమార్లు పొడిగించినట్టు సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించాలని జూన్ 30వ తేదీన కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంతకు ముందు ఇచ్చినగడువు ఈనెల 8వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో, వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున తన వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ఆదేశాలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. సమగ్ర నివేదిక ఇవ్వడానికి మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. అయితే, కొవిడ్ మరణాల ధ్రువీకరణ పత్రాల జారీ, నష్టపరిహారం అంశాలపై పిటిషన్ వేసిన న్యయవాది సుమీర్ సోధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగు వారాల సమయం ఇచ్చినట్టు కోర్టుకు గుర్తుచేశారు. ఆలస్యం జరుగుతున్న కొద్దీ బాధత కుటుంబాలు దారుణంగా నష్టపోతాయని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఈనెల 11వ తేదీలోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి తీరాలని ఇది వరకే కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. అయితే, నష్టపరిహారం ఎంత మొత్తంలో ఇవ్వాలి, తాత్కాలిక సాయంగా ఎంత ఇవ్వాలి అనే అంశాలపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోదని స్పష్టం చేసింది. పరిహారం ఎంత ఉండాలనేది కేంద్ర నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. పరిహారాలతోపాటు, కొవిడ్‌తో మృతి చెందిన వారికి మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి ఏకీకృత విధానాన్ని అనుసరించేలా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రానికి సూచించింది.
కొవిడ్ పరిహారంపై మార్గదర్శకాలేవి?
RELATED ARTICLES