కొత్తగా ఒకేరోజు 1,590 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో మరో 1,277 పాజిటివ్‌లు
మరో ఏడుగురు మరణం
మేడ్చల్ జిల్లాలో భారీగా కేసులు నమోదు
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అనూహ్యమైన రీతిలో విజృంభిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ఒకేరోజు 1,590 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 1500 మార్కు దాటడం ఇది మూడోసారి. గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా ఇంకా చెలరేగుతోంది. జిహెచ్ఎంసితోపాటు రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఈసారి అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,590 కొవిడ్ 19 కేసులు నమోదుకాగా, అందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలోనే ఏకంగా 1,277 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో ఏడుగురు కరోనాకు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 295కి చేరింది. ఇదిలావుండగా, రంగారెడ్డి జిల్లాలో 82, మేడ్చల్ జిల్లాలో 125 కేసులు రికార్డయ్యాయి. అయితే ఈసారి ఊహించనిరీతిలో సూర్యాపేట జిల్లాలో ఏకంగా 23 కేసులు దాపురించాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో 19, నల్లగొండ జిల్లాలో 14, మహబూబ్‌నగర్ జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, వనపర్తి జిల్లాల్లో నాలుగేసి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మూడేసి కేసులు, నిర్మల్, వికారాబాద్, బద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో రెండేసి కేసులు, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ రూరల్, నారాయణపేట, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాం టి కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,902కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 10,904 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 12,703 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారంనాడు 1,126 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 5,290 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, అందులో 3,700 శాంపిల్స్ నెగిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు మొత్తం 1,15,835 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల్లో 1184 పాజిటివ్‌లు 12 ఏళ్ల వయస్సు లోపువారికే వచ్చింది. అయితే వారంతా కరోనా వ్యాపించిన కొత్తలో ఈ వ్యాధి బారిన పడ్డారు. 5000 కేసులు దాటిన తర్వాత పిల్లల్లో పాజిటివ్‌లు పెద్దగా లేకపోవడం గమనార్హం. అలాగే, ఎక్కువగా ఈ వైరస్ మధ్య వయస్కుల వారికే సోకింది. ఇప్పటివరకు 13 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో 20,091 మందిలో ఈ పాజిటివ్‌లు బయటపడ్డాయి. అరవయ్యేళ్లు దాటిన వృద్ధులకు సంబంధించి 2,627 మందికి ఈ వైరస్ సోకింది. ఒక్కసారి వైరస్ సోకిన తర్వాత కోలుకోవడమనేది వృద్ధుల్లో తక్కువగా కన్పించింది.
కొవిడ్ కొరివి!
RELATED ARTICLES