24 కోట్ల 70 లక్షల మంది పిల్లలపై ప్రభావం : యునిసెఫ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ల కారణంగా 2020లో భారత్‌లో 15 లక్షల స్కూళ్లు మూతపడ్డాయి. ఫలితంగా ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో చదివే 24 కోట్ల 70 లక్షల మంది బాలలపై ప్రభావం పడిందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే, 16 కోట్ల 80 లక్షల మంది చదివే స్కూళ్లు పూర్తిగా ఏడాది మూతబడ్డాయని ఆ నివేదిక తెలిపింది. నలుగురిలో కేవలం ఒక్కరికే డిజిటల్ పరికరాలు, ఇంటర్‌నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్న కారణంగా ఆన్‌లైన్ విద్యా విధా నం సరైన ఎంపిక కాదని యునిసెఫ్ అధ్యయనంలో తేలింది. ఇక కొవిడ్‌కు ముందు భారత్‌లో కేవలం 24 ఇళ్లకే ఇంటర్‌నెట్ అందుబాటులో ఉందని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో లింగపరమైన విభజన ఉందని అది తెలిపింది.
కొవిడ్‌కు ముందే చదువుకు దూరం
“కొవిడ్, లాక్‌డౌన్ కారణంగా 2020లో భారత్‌లో 15 లక్షల బళ్లు మూతపడ్డాయి. దాంతో ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో చదువుకునే 24 కోట్ల 70 లక్షల మంది బాలలపై ప్రభావం పడింది. అయితే కొవిడ్ సంక్షోభం మొదలు కాకముందే దాదాపు 60 లక్షలకు పైగా బాలబాలికలు బడికి దూరమయ్యారు” అని యునిసెఫ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. నివేదిక ప్రకారం ఇప్పటివరకు భారత్‌లో కేవలం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే 1 నుంచి 12 తరగతులను ప్రారంభించాయి. మరో 11 రాష్ట్రాలు 6 నుంచి 12 తరగతులకు, 15 రాష్ట్రాలు 9 నుంచి 12 తరగతుల వారికి బళ్లు తెరిచాయి. చిన్నపిల్లలు ఎంతో కీలకమైన ప్రాథమిక విద్యను కోల్పోతున్న కారణంగా మూడు రాష్ట్రాలు ఆంగన్‌వాడీ కేంద్రాలను మళ్లీ తెరిచాయి. అలా మహమ్మారి కారణంగా దాదాపు ఓ ఏడాది కాలం పాటు భారత్‌లో బళ్లు మూతపడ్డాయి. పిల్లల సాధారణ జీవితానికి ఆటంకం ఏర్పడింది. పిల్లలు చదువుకు ఎక్కువ కాలంపాటు దూరంగా ఉండటం వారు మళ్లీ బడికి వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. అలా పిల్లలు బలహీనపడే ముప్పు పొంచి ఉంటుందన్న విషయం తెలిసిందే అని నివేదిక పేర్కొంది.
పిల్లల ప్రయోజనాలే లక్ష్యంగా…
అందుకని పిల్లల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే బళ్లను ప్రారంభించే నిర్ణయం తీసుకోవాలని నివేదిక సూచించింది. బళ్లు అనుమానంగా తెరుచుకుంటుండంతో తాము కోల్పోయిన పాఠాలను నేర్చుకునేందుకు పిల్లలకు అందరూ అండగా నిలవాలని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి డా. యాస్మిన్ అలీ హక్ పేర్కొన్నారు. డిజిటల్ విద్య అందుబాటులో లేని వారి విషయంలో ఇది మరింత వాస్తవమని ఆయన స్పష్టంచేశారు. ఇంకా పిల్లల మానసిక ఆరోగ్యం, సంక్షేమం కూడా కీలక అంశంగా నిలవనుందని ఆయన అన్నారు. ఈ దిశగా ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు, సంరక్షకుల నుంచి మానసిక, సామాజిక మద్దతు లభించడం ప్రధాన అంశంగా ఉండనుందని ఆయన తెలిపారు. కాగా, పాఠశాలలు మళ్లీ తెరవడంపై యునిసెఫ్, యునెస్కో, యుఎన్‌హెచ్‌సిఆర్, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆహార కార్యక్రమం ఒక ప్రపంచ వ్యాప్త కార్యచట్రాన్ని (ఫ్రేమ్‌వర్క్) అభివృద్ధి చేశాయి. దానినే భారత్‌కు కూడా అన్వయింప చేశారు. ఇక తరచుగా చేతులు కడుక్కోవడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిలో తరచుగా చేతులు కడుక్కోవడం, పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లకు ప్రాధాన్యమిస్తూ సురక్షితంగా పాఠశాలలు తెరవడం, బళ్లను శానిటైజ్ చేయడం, భౌతిక దూరం పాటించే వ్యూహాలపై జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర విద్యా శాఖ ఆమోదం తెలిపింది.
కొవిడ్ కారణంగా భారత్‌లో 15 లక్షల స్కూల్స్ మూత
RELATED ARTICLES