జిల్లాల్లో ఖాళీలపై స్పష్టత కరువు
నేరుగా ప్రధాన కార్యాలయానికి వివరాలు పంపుతున్న అధికారులు
నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు
ప్రజాపక్షం/పెద్ద శంకరంపేట/మెదక్
ప్రభుత్వం 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్లో కొలువులపై కోటి ఆశలు చిగురించా యి. అయితే జిల్లాల్లో ఖాళీలపై స్పష్టత కొరవడటం, వివరాలను అధికారులు కలెక్టరేట్‌కు కాకుండా నేరుగా ప్రధాన కార్యాలయానికి పంపిస్తుండటంతో ఖాళీలపై సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. ఇలా ఉంటే, చదివిన చదువుకు కొలువులు లభించక ఉపాధి కరువై, ఇతర పనులు చేసుకోలేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ కల సాకారమై ఏడేళ్లయినా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తీవ్ర నిరాశ చెందుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారి ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ ప్రకటనలు రాకపోవడంతో విసుగు చెందిన యువకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కొన్నాళ్లుగా కొలువుల కొట్లాట తీవ్రమవుతోంది. ప్రభుత్వం తీరుపై నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి సాంత్వన కలిగించేలా ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి సైతం ఇటీవల ప్రకటన చేశారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో శాఖలవారీగా ఖాళీల వివరాలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే జిల్లా స్థాయిలో మాత్రం ఖాళీల సమాచారం లేకుండా పోయింది. ఆయా శాఖల పరిధిలో ఉన్న ఖాళీల వివరాలను నేరుగా వారి ప్రధాన కార్యాలయాలకు పంపిస్తున్నారు. దీంతో జిల్లా స్థాయిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం లేకుండా పోయింది. ఫలితంగా ఖాళీల విషయంలో నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.
ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల, కోసం జరిగింది. రాష్ట్ర సాధనతోనే వీటిని సాధించవచ్చని ప్రజలు భావించారు. నియామకాల కోసం ఇక్కడి యువత, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమంలో ముందుండి పోరాడి స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసుకున్నారు. అయితే వారు ఆశించినట్లుగా ఉద్యోగ ప్రకటనలు వెలువడక పోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన ఏడు సంవత్సరాలలో అడపాదడపా కొన్ని పోస్టులు భర్తీ చేయడం మినహా పెద్దయెత్తున నోటిఫికేషన్లు జారీ కావడం లేదు. ఓవైపు ఉద్యోగుల విరమణతో ప్రభుత్వశాఖల్లో ఖాళీలు పెరుగుతున్నాయి. అయితే వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని, శాఖలవారీగా ఖాళీల వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు పోటీ పరీక్షల కోసం వేలాది మంది యువత సిద్ధమవుతున్నారు. అప్పులు చేసిమరీ కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు నోటిఫికేషన్ల ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్దీ ఏజ్ బార్ అయ్యే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీల వివరాలు నేరుగా ప్రభుత్వానికే
ఇదివరకు ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను కలెక్టరేట్‌కు పంపించేవారు. కలెక్టరేట్లో అధికారులు వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి అందజేసేవారు. ప్రస్తుతం ఇలాంటి పద్ధతులు పాటించడం లేదు. ఎవరికివారే ఆయా శాఖల పరిధిలో ఉన్న ఖాళీల వివరాలను సంబంధిత శాఖల ప్రధాన కార్యాలయాలకు పంపిస్తున్నారు.ఫలితంగా జిల్లాస్థాయిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియకుండా పోయింది.
త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలి
అనేక ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇప్పటికే పలుమార్లు కోచింగ్‌కి వెళ్ళాం. నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆర్థికంగా మానసికంగా అవస్థలు పడాల్సి వస్తోంది. కుటుంబ పోషణ కోసం ఇతర పనులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చాలి.
అనిల్ గౌడ్, ఉద్యోగార్థి
కొలువులపై కోటి ఆశలు..!
RELATED ARTICLES