10 మంది కొత్త మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్
సిఎం అయిన 66 రోజుల తరువాత మంత్రివర్గ విస్తరణ
ప్రజాపక్షం / హైదరాబాద్: ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. కొత్తగా పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ మంత్రివర్గం సంఖ్య డజనుకు చేరుకున్నది. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు పది మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులుగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడిA్డ, చామకూర మల్లారెడ్డి వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన నేతలు గవర్నర్‌కు అభివాదం చేసి అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పాదాభివందనం చేశారు. కాగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సిఎం కెసిఆర్‌తో పాటు గవర్నర్‌కు కూడా పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌తో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, పలువురు ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎంఐఎం ఎంఎల్‌సి అమీన్ ఉల్ జాఫ్రీ హజరు కాగా ఇతర విపక్ష పార్టీల నుంచి నాయకులెవ్వరూ హజరు కాలేదు. కాగా తాజా మంత్రివర్గ విస్తరణలో మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఇదిలా ఉండగా శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబరు 13న సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రి మహ్మద్ మహమూద్‌అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. పది మంది మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, టిఆర్‌ఎస్ నేతలు, అధికారులు, అనధికారులతో రాజ్‌భవన్ కాస్త కోలాహలంగా కనిపించింది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు వారి అభిమానులు, నేతలు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు.
కొలువదీరిన కొత్త మంత్రివర్గం
RELATED ARTICLES