సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభు త్వం మరోసారి దాడికి ఉపక్రమించింది. సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాలకు పేర్లను సూచించేందుకు ఏర్పడిన ఈ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని ఒకసారి, నిజానికి నియామకాలు భారత ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని మరొకసారి వ్యాఖ్య చేసిన కేంద్రం… ఇప్పుడు తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రతినిధులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ న్యాయ మంత్రిత్వ శాఖ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాసింది. అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తులను నియమించేందుకు సుప్రీంకోర్టు రెండు అంచెల కొలీజియంలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను, హైకోర్టు కొలీజియంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సిజెఐకి రాసిన తాజా లేఖలో సూచించారు. జాతీయ జ్యుడీషియల్ అపాయింట్‌మెం ట్ల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను మేరకు గతంలో సిజెఐకి రాసిన లేఖలకు ఈ లేఖ కొనసాగింపుగానే ఉందని న్యాయమంత్రి తెలిపారు. “కొలీజియం వ్యవస్థ ఎంఒపిని పునర్నిర్మించాలని రాజ్యాంగ బెంచ్ ఆదేశించింది’ అని రిజిజు పేర్కొన్నారు. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆయన పలు సందర్భాల్లో విమర్శించిన విషయం తెలిసిందే. అయితే న్యాయ శాఖ తాజాగా రాసిన లేఖ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం ప్రభుత్వానికి దొడ్డిదారిన ప్రవేశించే అవకాశం కల్పిస్తుందని సుప్రీంకోర్టు స్పందించింది. వివిధ నివేదికలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. 2015లో పార్లమెంట్ ఏకగ్రీవంగా ఎన్‌జెఎసిని ఆమోదించింది. అయితే సుప్రీంకోర్టు 2015లో దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. సిజెఐ నేతృత్వంలో న్యాయశాఖ మంత్రితో పాటు ఇద్దరు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉండాలని, ప్రధాని, ప్రతిపక్ష నేత, సిజెఐలతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసిన ఇద్దరు ప్రముఖులను ఎన్‌జెఎసి ప్రతిపాదించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆ చట్టం అమల్లోకి రాలేదు. ఇలావుంటే, కొలీజియంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులకు స్థానం కల్పించాలని మంత్రి రిజిజు లేఖ రాయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌సహా పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని పలు రాజకీయ పార్టీలు వ్యాఖ్యానించాయి.
కొలీజియం వ్యవస్థలో ప్రాతినిధ్యం ఇవ్వండి
RELATED ARTICLES