HomeNewsBreaking Newsకొలంబియాలోలెఫ్ట్‌ చారిత్రక విజయం

కొలంబియాలోలెఫ్ట్‌ చారిత్రక విజయం

బోగోటా (కొలంబియా) : దక్షిణ అమెరికా దేశం కొలంబియా సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి వామపక్షం ఘనవిజయం సాధించింది. 200 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా కొనసాగుతున్న సంప్రదాయ రాజకీయ వ్యవస్థను ఈ ఎన్నికల్లో ప్రజలు కుప్పకూల్చడంతో కొలంబియాలో మొట్టమొదటి వామపక్ష ప్రభుత్వం ఆవిష్కృతమైంది. తొలి వామపక్ష ప్రభుత్వానికి గుస్టావో పెట్రో దేశ అధ్యక్షుడుగా సారథ్యం వహించనున్నారు. రియల్‌ ఎస్టేట్‌ మిలియనియర్‌ రోడోల్ఫో హెర్నాండెజ్‌ను ఓడించి గుస్టావో పెట్రో ను గెలిపించడం ద్వారా ఆదివారంనాడు జరిగిన ఎన్నికల్లో కొలంబియా ప్రజలు చరిత్ర సృష్టించారు. అదేవిధంగా మొట్టమొదటిసారి ఒక నల్లజాతీయురాలైన మహిళ ఫ్రాన్సియా మార్కెజ్‌ (40) ను దేశ ఉపాధ్యక్షురాలుగా గెలిపించి కొలంబియా ఓటర్లు మరో చరిత్ర సృష్టించారు.ఫ్రాన్సియా మార్కెజ్‌ ప్రముఖ పర్యావరణవేత్త, న్యాయవాది, హౌస్‌ కీపర్‌ (విశ్రాంత). అధికారంలో ఉన్న పాలకులు దీర్ఘకాలంగా విస్మరించిన దేశంలో భారీ సంఖ్యలో ఉన్న ఆఫ్రో కమ్యూనిటీవర్గానకి ఆమె ఎంతో శక్తిమంతురాలైన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 2019లో అక్రమ గనుల తవ్వకాలను ఒక పర్యావరణవేత్తగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో ఆమెకు సంప్రదాయ రాజకీయవాదుల నుండి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. ఆమెపై లైంగిక అత్యాచార దాడి కూడా జరిగింది. పెట్రో 50.48 శాతం ఓట్లతో విజయం సాధించారు. కొలంబియాలో ఏళ్ళుగాకొనసాగుతున్న సంప్రదాయ పరిపాలనలో ప్రజలు విపరీతమైన అసమానతలు, ద్రవ్యోల్బణం, హింసాత్మక ఘటను వంటివి పేట్రేగిపోవడంతో ప్రజలు విసిగివేసారిపోయారు. సంప్రదాయబద్ధమైన పెట్టుబడిదారీ వ్యవస్థ పరిపాలనతో కునారిల్లిపోతున్న దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలలో కొలంబియా ఒకటి. దేశ ప్రజల్లో సర్వత్రా పెరిగిపోయిన అసంతృప్తికి చిహ్నంగా ఈ ఎన్నికల్లో గుస్టావో పెట్రోను గెలిపించడం ద్వారా 200 సంవత్సరాలుగా యథాతథంగా కొనసాగుతున్న రాజకీయ వ్యవస్థను ఒక్క కుదుపుతో పెకలించివేశారు. ఇప్పటికే చిలీ, పెరూ, హోండూరాస్‌ దేశాలలో వామపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు 2021 ఎన్నికల్లో వామపక్షాలకు చెందిన నాయకులను అధ్యక్షులుగా గెలిపించి వారి పరిపాలనలో ఉన్నారు. బ్రెజిల్‌లో మాజీ అధ్యక్షుడు లూయీజ్‌ ఇనాసియో లులా డ సిల్వ ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలకు ప్రధాన అభ్యర్థిగా సారథ్యం వహిస్తున్నారు. సంప్రదాయ రాజకీయ వ్యవస్థతో విసిగి వేసారిపోయిన దేశప్రజలు మొదటిసారి వామపక్షాన్ని గెలిపించి ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన మొదటి ఇద్దరు అభ్యర్థుల మధ్య రెండోసారి తిరిగి ఎన్నికల పోటీ జరుగుతుంది. ఈ రన్నాఫ్‌ పద్ధతితో హెర్నాండెజ్‌పై స్వల్ప ఆధిక్యంతో గుస్టావో పెట్రో విజయం సాధించారు. పెట్రోకు 50.48 శాతం ఓట్లు రాగా హెర్నాండెజ్‌కు 47.26 శాతం ఓట్లు లభించాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 3.90 కోట్లమంది ప్రజల్లో రెండుకోట్ల 16 లక్షలమంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు.“ఈరోజు ప్రజల పార్టీ అధికారంలోకి వచ్చింది” అని గుస్టావో పెట్రో ఈ సందర్భంగా ఆదివారంనాడు రాత్రి ట్వీట్‌ చేశారు. “మనం ఈ గొప్ప ప్రజా విజయాన్ని ఘనమైన వేడుకగా చేసుకుందాం, మన సొంతగడ్డ ప్రజల హృదయాలను ఆనందపారవశ్య ప్రవాహంలో ముంచెత్తిన ఈ గొప్ప సంతోషకరమైన విజయంతో ఇన్నాళ్ళుగా ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించిన ప్రజలు ఇకమీదట వాటికి దూరం అవుతారు” అని గుస్టావో పెట్రో తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రన్నాఫ్‌ ఎన్నికల్లో ఎంచుకున్న ఇద్దరిమధ్య ఆదివారంనాడు మూడోసారి పోటీ జరిగింది. మూడో ప్రయత్నంలో గుస్టావో పెట్రో విజయం సాధించారు. గతనెలలో జరిగిన మొదటి రౌండ్‌ ఎన్నికల్లో ఓటర్లు సుదీర్ఘకాలంగా పరిపాలన కొనసాగించిన మధ్యేవాద, మితవాద అనుకూల రాజకీయ నాయకులకు గట్టి శిక్ష విధించారు. కాగా పెట్రో ప్రత్యర్థి కూడా ఒక సందేశం విడుదల చేశారు. “వామపక్షాలను గెలిపించాలని ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని ప్రతిపౌరుడూ ఇకమీదట ప్రయోజనం పొందుతాడని నేను ఎంతో ఆశాభావంతో ఉన్నాను” అని ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం హెర్నాండెజ్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. “దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో గుస్టావో పెట్రోకు బాగా తెలుసునని నేను ఆశాభావంతో ఉన్నాను, ఎన్నికల ప్రచారంలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన చర్చలకు అనుగుణంగా ఆయన వినయవిధేయతలతో కట్టుబడి ఉంటారని భావిస్తున్నా, ఆయన్ను గెలిపించినవారిని నిరాశపరని భావిస్తున్నా” అని పేర్కొన్నారు.పెట్రో ప్త్రత్యర్థి హెర్నాండెజ్‌ ఈ ఎన్నికల్లో అవినీతి నిర్మూలన అంశాన్ని ప్రధాన ప్రచార అంశంగా తీసుకున్నారు. ఫలితాలు వెలువడగానే ఆయన తన ఓటమి అంగీకరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments