HomeNewsTelanganaకొనుగోలైన ఎలక్టోరల్‌ బాండ్లు 22,217

కొనుగోలైన ఎలక్టోరల్‌ బాండ్లు 22,217

రీడీమైనవి 22,030
వివరాలను ప్రకటించిన ఎస్‌బిఐ

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టిన తర్వాత, 2019- 24 మధ్యకాలంలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలయ్యాయని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) పేర్కొంది. ఈ వివరాలను భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ)కి సమర్పించినట్టు వివరించింది. పెన్‌డ్రైవ్‌లో ఇసిఐకి అందచేసినట్టు వివరించింది. డేటా, పాస్‌వర్డ్‌ సురక్షితంగా, రెండు పిడిఎఫ్‌ ఫైళ్లలో ఉందని ఎస్‌బిఐ తెలిపింది. 2019 ఏప్రిల్‌ నుండి 2024, ఫిబ్రవరి 15 మధ్య కాలంలో మొత్తం జారీ చేసిన ఎలక్టోరల్‌ బాండ్లలో వివిధ రాజకీయ పార్టీలు 22,030 బాండ్లను రీడీమ్‌ చేసుకున్నాయని తెలిపింది. మిగతా 187 బాండ్లను రీడీమ్‌ చేసి, నిబంధనల ప్రకారం నగదును ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్టు ఎస్‌బిఐ తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్ల జారీని సుప్రీం కోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, బాండ్ల జారీని రద్దు చేసింది. అంతేగాక, బాండ్లను ఎవరు కొన్నారు? ఎవరు వాటిని తమ ఖాతాలో జమ చేసుకున్నారు? అనే వివరాలను కూడా ప్రకటించాలని ఆదేశించింది. పూర్తి వివరాలను ఇసిఐకి తెలియచేయాలని స్పష్టం చేసింది. ఇసిఐ తన వెబ్‌సైట్‌లో మార్చి 13వ తేదీలోగా ఆ వివరాలను పోస్టు చేయాలని కూడా సూచించింది. కాగా, గోప్యతా ప్రమాణాలను పాటిస్తున్న కారణంగా వివరాలను డీకోడ్‌ చేయడానికి వీలుగా జూన్‌ 30వ తేదీ వరకూ సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఎస్‌బిఐ కోరింది. అయితే, ఈ అభ్యర్థనను సుప్రీం కోర్టు తరిస్కరించింది. వివరాలను మంగళవారం లోపు ఇవ్వాలని పేర్కొంటూ, డేటాను శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఇసిని కోరింది. ఎస్‌బిఐ తరఫు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే మాట్లాడుతూ, కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ వెలుపల ఎలక్టోరల్‌ బాండ్ల పథకం గురించి సమాచారాన్ని నిల్వ చేయడానికి బ్యాంక్‌ ఎస్‌ఒపిని అనుసరించిందని చెప్పారు. బాండ్ల ఎవరు కొన్నారు? ఏ రాజకీయ పార్టీ ఎన్ని బాండ్లను ఎన్‌క్యాచ్‌ చేసుకుంది? వంటి వివరాలను ఇవ్వాలంటే, పేర్లను క్రోడీకరించాలని, ఆ తర్వాత బాండ్‌ నంబర్‌తో క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని, ఇందుకు చాలా సమయం పడుతుందని వివరించారు. అయితే, రాజకీయ పార్టీలు స్వీకరించిన మొతాన్ని దాతల పేర్లతో సరిపోల్చమని బ్యాంకును కోరలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కోర్టు పేర్కొన్న కాలంలో, 15 రోజుల చెల్లుబాటు వ్యవధిలో రాజకీయ పార్టీలు ఎన్‌క్యాచ్‌ చేయని ఎలక్టోరల్‌ బాండ్ల మొత్తాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి బదిలీ చేసినట్టు ఇసిఐకి ఎస్‌బిఐ పంపిన లేఖను సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనితో ఎస్‌బిఐకి వివరాలను వెల్లడించక తప్పలేదు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments