బైసన్‌పోలోపై కేంద్రం విముఖతతో ఆశలు వదులుకున్న రాష్ట్ర సర్కార్
ప్రస్తుత సెక్రటేరియట్ స్థానే నూతన సచివాలయ నిర్మాణం
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేసే ముహుర్త ఖరారైంది. ఈ నెల 27వ తేదీలోగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయంలోనే శంకుస్థాపన చేయనున్నారు. బైసన్ పోలో మైదానంపై ఇన్నాళ్లూ ఆశగా నిరీక్షించినప్పటికీ ఆ భూమి అప్పగింత ప్రక్రియకు కేంద్రం నుండి సానుకూలత వ్యక్తం కాక పోవడం, ఎపికి కేటాయించిన సచివాలయం తెలంగాణకు అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొత్త సచివాలయ ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అది కూడా మంచి ముహూర్తాలకు మరో మూడు నెలల వరకు లేవని పురోహితులు చెప్పడం, ఈ నెల 27లోగానే మంచి రోజులు ఉన్నాయని చెప్పడంతో సచివాలయ భూమి పూజ శంకుస్థాపనకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను వారంలోగానే పూర్తి చేయాలని సిఎస్ ఎస్‌కె జోషిని ఆదేశించడంతో ఇరు రాష్ట్రాల ఆర్థికశాఖల అధికారులు భవనాల అప్పగింతపై కసరత్తును సిఎస్ ముమ్మరం చేశారు. ఈ మేరకు తెలంగాణ సిఎస్ ఎస్‌కె జోషితో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డిలు హాజరయ్యారు. వారం రోజుల లోపునే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. సచివాలయ సముదాయంతో సహా హైదరాబాద్‌లో ఎపికి గతంలో కేటాయించిన అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగించే దిశగా నిర్ణయం జరిగిన విషయాన్ని సిఎస్ ప్రస్తావిస్తూ.. ఎపి అంగీకారంతో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ వాటిని తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా ఎపి అవసరాల కోసం తెలంగాణలో పోలీస్ శాఖకు ఒకటి, మిగతా ప్రభుత్వ శాఖల నిర్వహణ కోసం మరొక భవనం కేటాయిస్తామని అన్నారు. ఎపి ప్రభుత్వానికి హైదరాబాద్‌లో ఏ భవనం కావాలో కూడా తెలియజేయాలని ఆ రాష్ట్ర అధికారులను కోరాలని సూచించారు. ఎపితో సఖ్యత నేపథ్యంలో ఇదే అదును : ఎపిలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సుహుద్భావ వాతావరణం నెలకొనడంతో విభజన అంశాలు కూడా ఇచ్చిపుచ్చుకునే విధంగా కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సెక్రటేరియట్ సహా ఇతర భవనాలను తెలంగాణకు అప్పగిస్తున్నందున ఎపి ప్రభుత్వ బకాయిలన్నీ కలిపి దాదాపు 14 కోట్ల మేర ఉన్న బకాయిలను కూడా రాష్ట్రం రద్దు చేసింది. హైదరాబాద్‌లో ప్రభుత్వ భవనాలను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ రాష్ట్ర విభజన సమయంలో మొత్తం 30 ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలను తెలంగాణకు అప్పగించడంతో ఆ 30 ఉత్తర్వులను సవరించాలని సిఎస్ ఆర్థిక శాఖకు, జిఎడికి సూచించారు. అంతే కాకుండా సెక్రటేరియట్ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరగా అప్పగించాలని ఏపి ప్రభుత్వాన్ని తెలంగాణ అభ్యర్థించింది. ఎపి సెక్రటేరియట్‌ను తెలంగాణ జిఏడికి, అలాగే అసెంబ్లీలో ఏపికి కేటాయించిన శాసనసభ భవనాన్ని అసెంబ్లీ కార్యదర్శికి , హైదర్‌గూడ ఓల్డ్ ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లోని ఏఎపికి కేటాయించిన క్వార్టర్స్‌ను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పజెప్పాల్సిందిగా సూచించింది. వారం రోజుల్లోనే భవనాల అప్పగింత పూర్తి చేస్తామని ఈ సందర్బంగా ఇరు రాష్టాల ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు సిఎస్ సమక్షంలో హామీ ఇచ్చారు . భవనాల అప్పగింత ప్రక్రియ పూర్తి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రోజునే తెలంగాణ సచివాలయ తరలింపు పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుత ఏపి సచివాలయంలోకి తెలంగాణ సచివాలయం షిఫ్ట్ చేసిన తర్వాత తెలంగాణకు కేటాయించిన ఏ, బి, సి, డి బ్లాకులను కూల్చివేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ సచివాలయ నూతన భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ఏపి సచివాలయం ద్వారా పాలన సాగించనున్నారు. కొత్తవి కట్టిన తర్వాత ఏపి భవనాలను కూల్చి వేసి అక్కడ మైదానం , పచ్చిక లాన్‌తో పాటు హెలీపాడ్‌ను కూడా నిర్మిస్తారని చెబుతున్నారు.