నల్లచట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన చేస్తాం
కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రతిపక్షాలు
రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించిన నేతలు
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఐదు పార్టీల ప్రతినిధిబృందం బుధవారంనాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి కోవింద్‌తో జరిగిన భేటీలోనూ స్పష్టంగా చెప్పినట్టు
వివరించారు. ఈ మేరకు రాష్ట్రపతికి మెమొరాండం అందించినట్టు వెల్లడించారు. రైతుల సమస్యలను తీర్చడం కేంద్రం బాధ్యతని గుర్తుచేశారు. మోడీ తన మిత్రబృందం కోసమే ఈ చట్టాలను చేశారని ఆరోపించారు. రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో ప్రతిపక్షాల నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎమ్‌కె నేత టికెఎస్ ఇళంగోవన్‌తో కూడిన బృందం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలిసింది. చట్టాలపై నిరసన తెలుపుతూ మెమొరాండం అందించింది. ‘నూతన వ్యవసాయ చట్టాలను ఎలాంటి చర్చలు లేకుండా, ఓటింగ్ జరగకుండా, అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఆమోదించారు. ఈ చట్టాలు భారత ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. ఇవి భారత వ్యవసాయ రంగం, రైతులను నాశనం చేసే విధంగా ఉన్నాయి. కనీస మద్దతు ధరను రద్దు చేసేందుకు ఈ చట్టాలు పునాదులు వేస్తున్నాయి. వీటిని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రపతితో సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం ఎంతో అవసరమని రాష్ట్రపతికి వివరించినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో దొడ్డిదారిన ఆమోదించారని, ఇది రైతులను అవమానించడమేనని పేర్కొన్నారు. రైతులు వెనుకడుగు వేయబోరని, పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు. ఈ కొత్త చట్టాలు ప్రధానమంత్రి మిత్రుల కోసం రూపొందించినట్లుగా స్పష్టంగా కన్పిస్తున్నదని వ్యాఖ్యానించారు. అయితే రైతులు భయపడటం లేదన్న విషయాన్ని మోడీ గుర్తుపెట్టుకోవాలని రాహుల్‌గాంధీ హితవు పలికారు. ఈ క్రూర చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రైతుల శాంతియుత ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అప్రజస్వామికంగా ఈ చట్టాలను ఆమోదించిన ప్రభుత్వం.. ఎందరో రైతుల జీవితాలను ప్రమాదంలో పెట్టిందని సీతారామ్ ఏచూరి అన్నారు. అందువల్ల వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతటి చలిలోనూ రైతులు నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నట్టు శరద్ పవార్ పేర్కొన్నారు. ఎవరిని అడిగి ఈ చట్టాలు చేశారని పవార్ ప్రశ్నించారు. కనీసం సెలక్ట్‌కమిటీకి కూడా ఈ బిల్లును సమర్పించలేదని వెల్లడించారు. ప్రతిపక్షం చేసిన ఏ ఒక్క సలహాను కూడా పాటించకుండా, నిస్సంకోచంగా ఈ బిల్లుకు ఆమోదం పొందారని చెప్పారు. రైతుల సమస్యలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. డి.రాజా స్పందిస్తూ, భారత అన్నదాతల డిమాండ్లలో న్యాయం వుందని, ప్రజలంతా వారి వెన్నంటి వున్నారని తాజా భారత్‌బంద్ నిరూపించిందని చెప్పారు. నల్లచట్టాలను వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రభుత్వం మర్యాద నిలుపుకోవాలని సూచించారు. కొవిడ్ కారణంగా రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురు ప్రతిపక్ష సభ్యులకు మాత్రమే అవకాశం లభించింది.
కొత్త వ్యవసాయ చట్టాలు మోడీ మిత్రుల కోసమే!
RELATED ARTICLES