ఇప్పటికి 4 సార్లు వాయిదా
ఆరేళ్ల నుంచి జారీకాని కార్డులు
ప్రతి జిల్లాలో వేలల్లో దరఖాస్తులు పెండింగ్
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో : కొత్తరేషన్ కార్డుల జారీ ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ట్టు ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించారు. దీంతో ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో నాలుగుసార్లు ఇలాంటి ప్రకటనలే వెలువడ్డాయి. కార్డులు లేని వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కొత్తగా రేషన్ కార్డులు జారీ కాలేదు. 2019 ఏప్రిల్‌లో రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు అధికారులకు ఆదేశా లు జారీ చేసి మార్గదర్శకాలను నిర్దేశించింది. కొన్నిరోజుల పాటు కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే రెండేళ్ల పాటు జరిగిన వరుస ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత లాక్‌డౌన్ విధించడం వల్ల కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టలేకపోయింది. దరఖాస్తు చేసుకున్న చాలా మందికి కార్డులు రాక నిరాశతో ఉన్నారు. మరికొంత మంది కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలోదరఖాస్తులు చేసుకున్నవారిలో అర్హులుగా గుర్తించినవారికే ప్రస్తుతం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదని, అవి అందిన తర్వాతే జారీ ప్రక్రియను చేపడుతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
లక్ష బోగస్ కార్డుల ఏరివేత
గతంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షకుపైగా రేషన్ కార్డులను రద్దు చేసింది. రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన సేకరించిన సమగ్ర సమాచారంతో పాటు రేషన్‌కార్డుల జారీ కోసం తీసుకున్న ఐరిస్, వేలిముద్రలు, ఆధార్‌కార్డుల జారీకి తీసుకున్న కుటుంబ వివరాలను కూడా ప్రత్యేక సర్వర్ ద్వారా క్రోడీకరించి బోగస్ అని తేలిన కార్డులను తొలగించింది. ఈ క్రమంలో అర్హులైనవారి కార్డులు కూడా పోయాయని అనేక మంది వాపోతున్నారు. తొలగించిన కార్డులను పునరుద్ధరించాలని కోరుతూ పెట్టుకున్న దరఖాస్తులు కూడా వేలల్లో ఉన్నాయి. వాటికి కూడా ఇప్పటి వరకు మోక్షం లేదు. మండలస్థాయిలో గిర్దావర్, తహసీల్దార్, జిల్లా పౌరసరఫరాల అధికారి వద్ద ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రతి జిల్లాలో వేలల్లో పెండింగ్
ప్రతి జిల్లాలోనూ రేషన్‌కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు రకాల రేషన్‌కార్డులు అందుబాటులో ఉన్నాయి. దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తుండగా, ఎగువన ఉన్నవారికి పింక్ కార్డులిచ్చారు. ఉమ్మడి జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల కోసం 66,965 దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 29,120 దరఖాస్తులు పౌరసరఫరాల శాఖలో అధికారుల వద్ద వివిధ స్థాయిలో విచారణ కోసం పరిశీలనలో ఉన్నాయి. ఇంకా 37,845 దరఖాస్తులు ఫైళ్ళలో దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10,89,027 రేషన్ కార్డులు ఉన్నాయి.
అన్ని సంక్షేమ పథకాలకు లింక్
రేషన్ కార్డు లేకపోవడం వల్ల సబ్సిడీ బియ్యమే కాదు.. దానితో ముడిపడి ఉన్న అనేక సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు. పింఛన్, ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు, బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రభుత్వం నుంచి ఇతరత్రా రాయితీలు వంటివి అందుకోలేకపోతున్నారు. దీంతో రేషన్ కార్డు కావాలనుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. కార్డు వారికి సంక్షేమ పథకాల ఎంపికలో ప్రాధాన్యత ఉంటుంది. ఇంత ముఖ్యమైంది కనుకనే ప్రభుత్వం కూడా కొత్త కార్డులను జారీ చేయడంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. దరఖాస్తుల వడపోత పేరుతో ఏళ్ల తరబడి నాన్చుతోంది. గతంలో రేషన్ కార్డు ఉన్నవారు అదే గ్రామంలోనే సరుకులు తీసుకోవాలనే నిబంధన ఉండేది. రేషన్ పోర్టబులిటీతో రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నవారు, కొత్తగా పెళ్లి చేసుకున్నవారు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
కొత్త రేషన్ కార్డులకు మోక్షమెప్పుడో?
RELATED ARTICLES