న్యూఢిల్లీ : ఒక పక్క కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నా.. యుకెలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది… భారత్‌లోనూ ఈ కేసులు క్రమంగా వెలుగుచూస్తున్నాయి… దేశంలో యుకె కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. బాధితులందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యసంరక్షణ సౌకర్యాలను గుర్తించిన సింగిల్ రూమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది. పాజిటివ్ వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపిం ది. కాగా, 38 కేసుల్లో.. 8 నమూనాలను ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సిడిసి)లో పరీక్షించగా పరివర్తన చెందిన యుకె స్ట్రుయిన్ కరోనా వైరస్ బయటపడింది. అదే విధంగా 11 శాంపిళ్లను ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంట్రాగేటివ్ బయోలాజీ (ఐజిఐబి)లో, ఒక నమూనాను కల్యాణి (కోల్‌కతా సమీపంలో ఉన్న) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ (ఎన్‌ఐబిఎంజి)లో, ఐదింటిని పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో, మూడు శాంపిళ్లను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలార్ బయాలాజీ (సిసిఎంబి)లో, మరో పదింటిని బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఆసుపత్రి (ఎన్‌ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్)లో పరీక్షించగా కొత్త రకం వైరస్ బయటబడింది. కాగా, బెంగళూరులోని ఎన్‌సిబిఎస్, ఇన్‌స్టీమ్, హైదరాబాద్‌లోని సిడిఎఫ్‌డి, భువనేశ్వర్‌లోని ఐఎల్‌ఎస్, పుణెలోని ఎన్‌సిసిఎస్‌లో ఇప్పటి వరకు ఎలాంటి యుకె కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూడలేదని మంత్రిత్వశాఖ వెల్లడించింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఈ కొత్తరకం వైరస్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. భారత్‌లోనూ ఈ రకం కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా యుకెకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆంక్షల కంటే ముందే భారత్‌కు వచ్చిన యుకె ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించింది. వీరిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో కొత్తరకం వైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు యుకె నుంచి వచ్చిన 38 మందికి స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య 33వేలకు పైగా మంది బ్రిటన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చినట్లు కేంద్రం తెలిపింది. వీరిందరినీ గుర్తించిన ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని వెల్లడించింది.
కొత్త రకం కరోనా 38 కేసులు
RELATED ARTICLES