తక్షణమే రద్దుచేయాలి
లేకుంటే ప్రతిఘటిస్తాం
ఆటో, క్యాబ్, లారీ సంఘాల జెఎసి హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రధాని మోడీ తన నియంతృత్వ ధోరణితో తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టాన్ని తక్షణమే రద్దు చేయకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆటో, క్యాబ్, లారీ సంఘాల జెఎసి హెచ్చరించింది. నూతన మోటారు వాహన చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని,లేట్ ఫిట్‌నెస్ పేరుతో విధించిన వెలాది రూపాయల పెనాల్టీలను రద్దు చేయాలని, ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో విధిస్తున్న భారీ రుసుములను నిలిపివేయాలని, నూతన మోటారు వాహన చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆటో,క్యాబ్,లారీ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో ‘చలో రాజ్ భవన్”లో భాగంగా హైదరాబాద్,ఖైరతాబాద్ చౌరస్తా నుండి వందలాది మందితో మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో జెఎసి నేతలు బి. వెంకటేశం (ఎఐటియుసి), ఎ. సత్తిరెడ్డి (టిఎడిఎస్), వేముల.మారయ్య, (టిఆర్‌ఎస్‌కెవి),ఎండి.అమానుల్లా ఖాన్ (టిఎడి.జెఎసి),కిరణ్ (ఐఎఫ్‌టియు ), శ్రీకాంత్ (సిఐటియు), ఎం.రాజేందర్ రెడ్డి (లారీ సంఘాల జెఎసి), రాజశేఖర్ రెడ్డి, దూపం ఆంజనేయులు, నగేష్, సతీష్, తిరుమలేష్‌గౌడ్ ( క్యాబ్ జెఎసి) ఆర్. మల్లేష్, ఎ.నరేందర్ (ఎఐటియుసి),అజయ్ బాబు (సిఐటియు) తదితరులు హాజరయ్యారు. “మోడీ డౌన్ డౌన్, నూతన మోటారు వాహన చట్టం వెనక్కి తీసుకోవాలి..కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలి.. తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయవద్దు” అంటూ వారు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాజ్ భవన్ వైపు దూసుకెళ్లడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసన కారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి గోషమహల్ పోలీస్ స్టేడియంకు తరలించారు. అంతకుముందు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆక్రందనలు పెడచెవిన పెడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కృరత్వంతో ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తోందని మండిపడ్డారు. నూతన మోటారు వాహన చట్టం రవాణా కార్మికుల మెడకు గుదిబండగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు ఎక్కువగా రాత్రి పూట దోస్తారని, కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టపగలే దోచుకుంటుందని తెలిపారు. దోపిడీ చేసే పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేస్తామని, ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే తాటతీస్తామని హెచ్చరించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న్ల కేంద్రం, నూతన మోటారు వాహన చట్టాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టాన్ని అమలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. గత 8 సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు వంద శతం పెరిగాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను పెంచలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్, రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తక్షణమే స్పందించి ఆటో మీటర్ కనీస ఛార్జి రూ. 20 నుండి రూ.40లకు,కిలోమీటర్‌కు రూ.11ల నుంచి రూ 25 లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో నిరుద్యోగులైన బడుగుబలహీన వర్గాలకు కొత్త ఆటో పర్మిట్లు మంజూరు చేయాలని,భరించలేని ఇన్సూరెన్సు ధరలు తగ్గించాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని, కరోనా మహమ్మారి సమయంలో నష్ట పోయిన ఆటో డ్రైవర్లను కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు కోరారు.
కొత్త మోటారు వాహనచట్టం కార్మికుల మెడకు గుదిబండ
RELATED ARTICLES