నేటితో ముగిసిన అభిప్రాయాల సేకరణ
టాప్ 3 లేదా 5లకు త్వరలో ఢిల్లీకి పిలుపు
వివిధ పోస్టుల్లో సర్దుబాటుకు అధిష్టానం ప్లాన్
ప్రజాపక్షం / హైదరాబాద్ క్రిస్మస్ (డిసెంబర్ 25వ తేదీ) కల్లా కొత్త పిసిసి చీఫ్ ఎవరనే అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన మాణిక్కం ఠాగూర్ రెండో రోజున గురువారం నాడు ఎఐసిసి సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎ, మాజీ ఎంపిలు, డిసిసి అధ్యక్షుల అభిప్రాయాలను వన్ టు వన్ తీసుకున్నారు. శుక్రవారం నాడు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఆయన వెన్వెంటనే ఢిల్లీకి వెళ్ళి ఒకటి రెండు రోజుల్లో నివేదికను ఎఐసిసి ఆర్గనైజేషన్ ఇన్‌చార్జ్ కె.సి.వేణుగోపాల్‌కు అందజేస్తారు. ఆ వెంటనే దానిపై ఎఐసిసి స్థాయిలో పరిశీలించి, అభిప్రాయ సేకరణలో ముందు ఉన్న ముగ్గురు లేదా ఐదుగురు పేర్లతో, సామాజిక సమీకరణలను సూచిస్తూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వచ్చే వారంలో నివేదిక పంపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దాని ఆధారంగా అధ్యక్షురాలు కూడా ముఖ్య నేతలతో చర్చించి, టాప్‌లో ఉన్న ముగ్గురు లేదా ఐదుగురిని ఢిల్లీకి పిలిపించనున్నారు. అందులో పిసిసి అధ్యక్షునిగా నియమించే వారితో మాట్లాడి, ఆ తరువాత మిగతావారితో కూడా విడివిడిగా చర్చించి, వివిధ అవకాశాలపై హామీలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇదంతా క్రిస్మస్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ లోగా కానట్లయితే, కొత్త సంవత్సరంలో తొలి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.
పిసిసి చీఫ్‌తో పాటు ప్రచార కమిటీ చైర్మన్‌కూ ప్రాధాన్యం
పదువుల నియామకాల్లో ఎవరిని బాధ కలిగించకుండా పిసిసి అధ్యక్షుని పదవితో పాటే ఎఐసిసి స్థాయిలో మరికొన్ని ముఖ్య పదవులను కూడా రాష్ట్ర నేతలకు ఇవ్వనున్నారు. ముఖ్యంగా పిసిసి చీఫ్ పదవికి తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరినీ బాధపెట్టకుండా సాధారణంగా పిసిసి అధ్యక్షునికి ఉండే అధికారాలతో పాటు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్‌కు కూడా అభిప్రాయాలు, పార్టీ వేదికల్లో సమాన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ప్రచార కమిటీ చైర్మన్‌ను ఎన్నికలకు ముందు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సారి మాత్రం పిసిసి చీఫ్‌తో పాటే ప్రకటించనున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రానికి చెందిన నేతలకు ఎఐసిసి జనరల్ సెక్రటరీ , సెక్రటరీ జాతీయ అధికార ప్రతినిధి పదవుల్లో రెండు చొప్పున కేటాయించే అవకాశం ఉంది.
హోరాహోరి లాబీయింగ్
అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా లాబీయింగ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్లు ముందున్నా, మిగతా నేతలు కూడా రకరకాల సమీకరణలతో తెరపైకి వచ్చారు. సీనియర్‌లు ఎక్కువ మంది పార్టీలో మొదటి నుండి ఉన్న వారికే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెబుతున్నారు. అయితే, వారు అందరూ ఒకే పేరును ప్రతిపాదించలేకపోతున్నారు. చాలా మంది కొత్త వారికి వద్దని, తమకు అవకాశం కల్పించాలనే చెబుతన్నారే తప్ప ఏకాభిప్రాయంతో ఒక పేరును తెరపైకి తీసుకురావడం లేదు.
కొత్త పిసిసి చీఫ్ క్రిస్మస్‌లోపే..!
RELATED ARTICLES