బిజెపి సర్కార్‌పై సిపిఐ పార్లమెంటరీపక్ష నాయకులు బినోయ్ విశ్వం మండిపాటు
బిజెపి వినాశకర ఆర్థిక, సామాజిక విధానాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కార్మికవర్గం పూనుకోవాలని పిలుపు
తిరుప్పూర్ (తమిళనాడు) నుంచి డి. సోమసుందర్
కార్మికులు తమ వర్గప్రయోజనాల పరిరక్షణకోసం ‘మోడీ హటావో.. దేశ్ బచావో’ నినాదంతో గట్టి రాజకీయ వైఖరి తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని, దేశప్రజల కోసం రాజకీయ పోరాటంలో కార్మికులు భాగస్వాములు కావాలని సిపిఐ పార్లమెంటరీపక్ష నాయకులు, ఎఐటియుసి కార్యనిర్వహక అధ్యక్షులు బినయ్ విశ్వం పిలుపు నిచ్చారు. బిజెపి వినాశకర ఆర్థిక, సామాజిక విధానాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కార్మికవర్గం పూనుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్‌లో మూడురోజులపాటు జరిగిన ఎఐటియుసి జనరల్ కౌన్సిల్ సమావేశాల ముగింపుసభలో బినయ్ విశ్వం మాట్లాడారు. ఆదివారం జరిగిన ముగింపు సమావేశానికి ఎఐటియుసి అధ్యక్షుడు రామేంద్రకుమార్ అధ్యక్షత వహించారు. బినోయ్ విశ్వం మాట్లాడుతూ గత వారం జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రహసనంగా మార్చారని, సమావేశాల నిర్వహణ విషయంలో ప్రతిపక్షాలను విస్మరించి, బిజెపి సొంత వ్యవహారంగా నడిపారని విమర్శించారు. పాతపార్లమెంట్ ను మోడీ మ్యూజియంగా మిగిల్చారని, దానితో ముడిపడిన ప్రజాస్వామ్య విలువలను, ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయాలను కాషాయ పార్టీ తుంగలోకి తొక్కిందని బినోయ్ విశ్వం ధ్వజమెత్తారు. కొత్త పార్లమెంట్‌కు సినిమా నటులను, తమపార్టీ కార్యకర్తలను ఆహ్వానించి సొంత ప్రచారానికి వాడుకున్న తీరు గర్హనీయమన్నారు. సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన రోజున బిజెపి మహిళా కార్యకర్తలను పెద్దఎత్తున సభకు రప్పించి మోడీకి జేజేలు కొట్టించుకోవడం ఆపార్టీ ప్రచార యావకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బిజెపి ఎంతగా గొప్పలు చెప్పుకున్నా మహిళా రిజర్వేషన్ బిల్లును తయారు చేసింది సిపిఐ నేత గీతాముఖర్జీ అనే వాస్తవాన్ని దాచలేకపోయిందని, గీతా ముఖర్జీ వల్లనే బిల్లు వచ్చిందన్న సంగతి దేశప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. ప్రత్యేక సమావేశాల గురించి మోడీ ఎంత
ఆర్భాటం చేసినా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి అక్కడ తగినచర్చ జరగలేదన్నారు. బిజెపి ఆర్థిక, సామాజిక విధానాలలోని బూటకాన్ని ఎండగట్టడానికి కార్మికవర్గం పూనుకోవాలని, తమ హక్కుల పరిరక్షణ కోసం గట్టి ఉద్యమాలను నిర్మించాలని, రానున్న ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి ప్రజల్లో చైతన్యం తేవడానికి కార్మికవర్గం పూనుకోవాలని బినయ్ విశ్వం పిలుపు ఇచ్చారు. కార్మిక హక్కులపై దాడి, ప్రైవేటీకరణ, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, పతనమవుతున్న రూపాయి విలువ, వివిధ ప్రాంతాల్లో చెలరేగుతున్న సామాజిక ఘర్షణలు వంటి తీవ్ర సమస్యలపై మరిన్ని పోరాటాలు సాగించాల్సి ఉంటుందని అన్నారు. అక్టోబర్ 31వ తేదీన ఎఐటియుసి 104 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని దేశమంతటా ఘనంగా నిర్వహించాలని, అనుబంధసంఘం ఉన్న ప్రతిచోటా ఎఐటియుసి జెండా స్తంభాన్ని ఏర్పాటు చేయాలని, అందుకు తగిన ప్రణాళికను రాష్ట్ర సమితులు రూపొందించాలని కోరారు. దేశంలోని తొలి కార్మికసంఘంగా ఎఐటియుసి సాగించిన పోరాటాలను, సాధించిన విజయాలను కార్మికవర్గానికి వివరించాలని, కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో నిరంతరం ముందుండాలని బినోయ్ విశ్వం పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత, మహిళలు, దళితులు, ఆదివాసీలు తమ హక్కులకోసం చేస్తున్న పోరాటాలకు కార్మికవర్గం మద్దతు ఇవ్వాలని, వారి పోరాటాలతో మమేకం కావాలని ఆయన కోరారు. నవంబరు నుండి అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం, ఇప్టా సంయుక్తంగా చేపట్టనున్న ప్రచార జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎఐటియుసి శ్రేణులు పూర్తి అండదండలు అందించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రధానకార్యదర్శి అమర్ జీత్ కౌర్ సమావేశాల ముగింపులో మాట్లాడుతూ జనరల్ కౌన్సిల్ తీర్మానాలను, నిర్ణయాలను అమలు చేయడానికి రాష్ట్రసమితులు, అనుబంధ జాతీయ ఫెడరేషన్లు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో సుమారు అరవై మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొనగా , పలు తీర్మానాలను ఆమోదించారు.
కొత్త పార్లమెంట్ వేదికగాసొంత ప్రచారం
RELATED ARTICLES