ప్రతిపాదనలు సిద్ధం చేసిన స్టాంప్స్ అండ్ రిజిష్ర్టేషన్ల శాఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ ; రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో భూమలు ధరలను పెంచాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. అందులో భాగం గా మొత్తం 33 జిల్లాలకు గాను ఆయా జిల్లాల నైసర్గిక స్వరూపం, రియల్ భూమ్‌ను బట్టి నెల రోజుల్లోనే ధరల పెంపును చేయనున్నారు. రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు మెదక్, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లా లో రియల్ భూమ్‌ను బట్టి భూముల ధరలు పెంచబోతున్నారు. వ్యవసాయ భూములే కాకుండా కమర్షియల్ లాండ్ తదితరాలను బట్టి ధరలు ఉండనన్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కొత్త జిల్లాల వారీగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్క సారిగా ఊపందుకుంది. నిన్న మొన్నటి వరకు ఎకరా 5 నుండి 8 లక్షలు పలికిన భూములు తాజాగా 30 నుండి 40 లక్షలు పలుకుతున్నాయని అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే గత ఏడాది 10వేల కోట్ల విలువ చేసే భూ క్రయ విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఇలాంటి అంశాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని భూధరల నిర్ణయం ఉండనుందంటున్నా రు. మరోవైపు రియల్ ఎస్టేట్ వర్గాలకు రుణా లు ఇచ్చేందుకు బ్యాంకర్లు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుం టూరు, అమరావతి లాంటి చోట్ల ప్రస్తుతం ఉన్న ధరలు ఉండేవి కావని, రాజధాని వచ్చాకే ధరలు పెరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా తమ వ్యాపారాన్ని హైదరాబాద్ చుట్టు పక్కలే కాకుండా భువనగిరి, శంషాబాద్ లాంటి చోట్లకు విస్తరిస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా శివార్లలో కొద్ది రోజులుగా మార్కెట్ నిలకడగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ జిల్లా కంది, సంగారెడ్డి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశాం తాము అనుకున్న స్థాయిలో ధరలు రావడం లేదు. దీంతో తాము రాజధాని చుట్టు పక్కల కాకుండా ఖమ్మం లాంటి చోట్లను వ్యాపారం చేయదలిచాం అని కొందరు రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటి రంగాల పరంగా అభివృద్ధి చేస్తోందని, వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాలే ఇందుకు నిదర్శనమని వారు విశ్లేషిస్తున్నారు.