స్థానికత మారి ఉద్యోగాలు కోల్పోయిన పంచాయతీ కార్యదర్శుల అభ్యర్థులు : వేల సంఖ్యలో బాధితులు
పెద్ద మొత్తంలో వినతులు, చేతులెత్తేస్తున్న అధికారులు
ప్రజాపక్షం / హైదరాబాద్ : కొత్త జిల్లాలు వేలాది మంది నిరుద్యోగుల బంగారు భవిష్యత్తును దెబ్బతీశాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతగానో శ్రమించి సాధించినప్పటికీ వారికి ఉద్యోగం రాకుండా చేశాయి. ఇటీవల జరిగిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో ఈ ఘోరం జరిగింది. ఇది తమ తప్పు కాదని, వచ్చిన ఉద్యోగాన్ని దూ రం చేయవద్దని భారీ సంఖ్యలో అభ్యర్థులు పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు వచ్చి అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. తామేమీ చేయలేమని, నిబంధనల ప్రకారం ఉద్యోగావకాశం ఇవ్వలేమని పంచాయతీరాజ్ అధికారులు వారికి స్పష్టం చేస్తున్నారు. కొత్త జిల్లాల కారణంగా స్థానికేతరులుగా మారి ఉద్యోగాలు చేజార్చుకున్న వారి నుంచి వినతి పత్రాలను ముందు నేరుగా అధికారులే తీసుకోగా వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వందల సంఖ్యలో వస్తుండడంతో వారిని వారి వినతి పత్రాలను ఇన్‌వార్డ్‌లో ఇచ్చి వెల్లాలని అధికారులు స్పష్టం చేశారు. అంటే నియామకపు పరీక్షలో మెరిట్ సాధించి ఉద్యోగానికి ఎంపికైనప్పటికి స్థానికత ధ్రువీకరణ పత్రం మరో జిల్లాలో ఉండడంతో వారిని పక్కన బెట్టి ఆయన తర్వాత ఉన్న మరో అభ్యర్థిని జిల్లా కలెక్టర్లు ఎంపిక చేస్తున్నారు. ఈ తప్పిదం జరగడానికి అభ్యర్థుల స్వయం కృపాదారం ఉన్నప్పటికి వారిని ఈ విషయంలో జాగృతం చేయకపోవడం, పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ సమయంలో స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. కొత్త జిల్లాలు ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో పలు ఉద్యోగాల నియామకాలు జరిగాయి. అయితే అవి పూర్వపు జిల్లాల వారీగానే జరిగాయి. దీంతో జూనియర్ కార్యదర్శులు పోస్టులకు కూడా అదే మాదిరిగా నియామకాలు చేపడుతున్నారని భావించి చాలా మంది వారి స్థానికత కాలంలో పూర్వపు జిల్లాను పేర్కొన్నారు. తీరా ఫలితాలు రావడం, ఎంపికయ్యాక వారి జిల్లా కలెక్టర్ల వద్దకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెల్లారు. అక్కడ వారి స్థానికత జిల్లా మరొకటి ఉండడంతో నాన్‌లోకల్ కోటాలోకి వెల్లిపోయారు. దీంతో ఎంపిక కాలేదు. అయితే వారి స్థానికత ఉన్న జిల్లాలో అదే మార్కులకు ఎంపికవుతున్నప్పటికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ జిల్లాను లోకల్‌గా పెట్టకపోవడంతో ఇది సాద్యం కాదని, ఆయన తర్వాతి అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారు. ఉదహరణకు పరిశీలిస్తే రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలను మొత్తం 31జిల్లాలుగా చేశారు. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో ఆదిలాబాద్ పోనూ నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ అనే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని అభ్యర్థులు అలవాటు ప్రకారం స్థానికత కాలంలో ఆదిలాబాద్‌ను ఎంచుకున్నారు.