దేశంలో 24 గంటల్లో 36,470 మందికి కరోనా
ఒక్క రోజు వ్యవధిలో మరో 488 మంది మృత్యువాత
79 లక్షలు దాటిన పాజిటివ్‌లు : లక్షా 20 వేలకు చేరువలో మరణాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. నిత్య మరణాల సంఖ్య కూడా 500 దిగువకు పడిపోయాయి. మరోవైపు రికవరీ రేటు పెరుగుతుండ డం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కాగా, దేశం లో కరోనా కొత్త కేసులు మూడు నెలల కష్ఠానికి పడిపోయాయి. ఒక్కరోజు వ్యవధిలో 40 వేల దిగువకు కొత్త కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 79 లక్షలు దాటింది. వరుసగా రెండ-వ రోజు కూడా 500 లోపు మరణాలు సంభవించాయి. ఇక సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,470 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,46,429కి చేరింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం జులై 23న 45,720 కేసులు నమోదు కాగా, ఆదివారం అంతకంటే తక్కువగా 45,148 కేసులులొచ్చాయి. అయితే తాజాగా కొత్త కేసుల సంఖ్య 40 వేల దిగువకు పడిపోయింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 488 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,19,502కు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.50 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. కొవిడ్ 19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది. గత 24 గంటల్లో మరో 63,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త రికవరీలతో కలిపి మంగళవారం ఉదయం నాటికి 72,01,070 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జాతీయ రికవరీ రేటు 90.62 శాతానికి ఎగబాకింది. ఇక నిత్యం యాక్టివ్ కేసుల సంఖ్య పడిపోతుంది. గత ఐదు రోజుల నుంచి 7 లక్షల లోపే రికార్డు అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 6,25,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో ఈ సంఖ్య 7.88 శాతం మాత్రమేనని మంత్రిత్వశాఖ పేర్కొంది. భారత్‌లో ఆగస్టు 7న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలు, సెప్టెంబర్ 28న ఆ సంఖ్య 60 లక్షలు దాటింది. అక్టోబర్ 11 నాటికి ఆ సంఖ్య 70 లక్షలు దాటింది. అయితే దేశంలో లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పట్టగా, అవి 59 రోజుల్లో 10 లక్షలకు చేరాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో, బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. మృతుల సంఖ్యలో మాత్రం భారత్ మూడవ స్థానంలో కొనసాగుతుంది. రోజువారీ రికవరీల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 10,44,20,894 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తి చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. సోమవారం 9,58,116 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. కొత్తగా 488 మరణాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పడిపోయాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 84 మంది మృతి చెందారు. కర్నాటకలో 41, తమిళనాడులో 36, పశ్చిమ బెంగాల్‌లో 59, ఛత్తీస్‌గఢ్‌లో 43, ఢిల్లీలో 54 మంది మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 1,19,502 మంది బలి కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 43,348 మంది మృత్యువాత పడ్డారు. అదే విధంగా తమిళనాడులో 10,956, కర్నాటకలో 10,947, ఉత్తరప్రదేశ్‌లో 6,904, ఆంధ్రప్రదేశ్‌లో 6,606, పశ్చిమ బెంగాల్‌లో 6,546, ఢిల్లీలో 6,312, పంజాబ్‌లో 4,125, గుజరాత్‌లో 3,690 మంది కొవిడ్ కారణంగా మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా వెల్లడయింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ఒక్క రోజు వ్యవధిలో 3,645 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. తాజాగా కేరళలో 4,287, పశ్చిమబెంగాల్‌లో 4,121, కర్నాటకలో 3,130 మందికి పాజిటివ్ వచ్చింది.
కొత్త కేసులు 3 నెలల కనిష్ఠానికి
RELATED ARTICLES