అందులో ప్రవాసులు, వలసకార్మికులు 51 మంది
24 గంటల్లో లోకల్ పాజిటివ్‌లు 66 కొత్తగా నలుగురు మృతి
ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్థానికులు 66 మంది కాగా, అందులో జిహెచ్‌ఎంసి పరిధిలో 58, సిద్దిపేట జిల్లాలో ఒకటి, మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే సౌదీ అరేబియా నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన 49 మంది, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఇద్దరు వలస కూలీలకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ గురువారం నలుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 2256 కరోనా కేసులలు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణలోనే కరోనా సోకిన వారి సంఖ్య 1908 కాగా, ఇతర దేశాలు, రాష్ట్రాల పాజిటివ్ వచ్చి ఇక్కడికి వచ్చిన వారి సంఖ్య 348. ఇప్పటి వరకు 1345 మంది డిశ్చార్జ్ కాగా, 67 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 844 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారు. కాగా ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి వచ్చిన కరోనా సోకిన వారిలో సౌదీ అరేబియా నుండి వచ్చిన వారు 143 మంది, వలస కార్మికులు 175 మంది, విదేశీ ప్రయాణికులు 30 మంది ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సౌదీ అరేబియా నుండి 458 మందిని భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో తీసుకురాగా, వారిని హైదరాబాద్‌లోని ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్వారంటైన్‌లో ఉంచారు. అందులో 143 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికుల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులను స్వగ్రామంలోనే హోం క్వారంటైన్‌లో ఉంచి, లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గందరగోళంగా హెల్త్ బులెటిన్
కరోనా సోకిన వారి వివరాలతో కూడిన హెల్త్ బులెటిన్ గత రెండు రోజులగా గందరగోళంగా ఉంటుంది. మొదట్లో ఆ రోజు ఎన్ని కేసులు వచ్చాయో జిల్లాల వారీ వివరాలు, ఎంత మంది మరణించారో, మొత్తం ఎన్ని కేసులు వంటి వివరాలు ఉండేవి. అయితే రెండు రోజులగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను విభజించి స్థానికులు, ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి వచ్చిన వారు అని విడివిడిగా ఇస్తున్నారు. ఇతరులు వేరే ప్రాంతాల నుండి వచ్చినప్పటికీ వీరిలో అత్యధికులు తెలంగాణవాసులే, పైగా కరోనా నిర్ధారణ కూడా ఇక్కడే అవడంతో పాటు, వారికి చికిత్స కూడా ఇక్కడ చేయాల్సిందే. పైగా ఆ రోజు ఎంత మంది మరణించారనే వివరాలను కూడా బులెటిన్‌లో పేర్కొనడం లేదు. అయితే, స్థానికంగా కేసులు ఎక్కువగా చూపించుకోవద్దనే ఉద్దేశంతోనో మరే ఇతర ఉద్దేశంతోనే కేసులను వేర్వేరుగా ఇస్తుండడంతో కొంత అయోమయం నెలకొంది.
కొత్త కేసులు 117
RELATED ARTICLES