HomeNewsBreaking Newsకేసుల సత్వర పరిష్కారానికి జడ్జీల పెంపు

కేసుల సత్వర పరిష్కారానికి జడ్జీల పెంపు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కేసులు త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించామని చెప్పారు. న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నామన్నారు. ‘తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022” హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా సిజెఐ జస్టిస్‌ ఎన్‌వి రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవ్వగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్వల్‌ భూయాన్‌ పాల్గొన్నారు. జస్టిస్‌ ఎన్‌వి రమణ మాట్లాడుతూ చేతికి ఎముక లేని తనానికి సిఎం కెసిఆర్‌ ఒక ట్రేడ్‌ మార్క్‌ అని అన్నారు. తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని, జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారని, తెలంగాణలో మా త్రం సిఎం కెసిఆర్‌ 4320కు పైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కెసిఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ వచ్చిందని, వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోందని, తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని జస్టిస్‌ రమణ తెలిపారు.
జస్టిస్‌ రమణ చొరవతోనే హైకోర్టు బెంచ్‌ల సంఖ్య పెంపు: సిఎం కెసిఆర్‌
హైకోర్టు విభజన తర్వాత హైకోర్టు బెంచ్‌ల సంఖ్యను పెంచాలని తాను స్వయానా ప్రధానికి లేఖ రాసినా పెండింగ్‌లో పెట్టారని, జస్టిస్‌ ఎన్‌వి రమణ చొరవ తీసుకుని ప్రధాని, కేంద్రప్రభుత్వంతో మాట్లాడి హైకోర్టులో బెంచ్‌ల సంఖ్యను 24 నుండి 42కు పెంచారని గుర్తు చేశారు. ఇం దుకు జస్టిస్‌ రమణకు రాష్ట్ర పజల పక్షాన సిఎం ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టులో బెంచ్‌ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కరస్పాండింగ్‌ సిబ్బం ది, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ కోరారని, దీంతో గతంలో 780పై చిలుకు పోస్టులను మంజూరు చేయగా, తాజాగా మరో 885 అదనపు పోస్టులను మంజూరు చేసిన విషయాన్ని సిఎం వివరించారు. జిల్లా కోర్టుల్లో పనిభారం బాగా ఉన్నందున అందుకు అనుగుణంగా న్యాయమూర్తుల పోస్టులను, మెజిస్ట్రేట్‌ పోస్టుల సంఖ్యను పెంచాలని సిఎం కోరారు. జిల్లా కోర్టుల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేసి, అన్ని వసుతలతో కూడిన భవనాలను నిర్మిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లా కోర్టులను దృష్టిలో పెట్టుకుని 1730 అదనపు పోస్టుల ను కూడా మంజూరు చేస్తున్నామని సిఎం ప్రకటించారు. హైకోర్టు, జిల్లా, మెజిస్ట్రేట్‌లో తగిన సిబ్బందిని సమకూరుస్తామన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత న్యాయపరిపాలన విభాగం నిమిత్తం రాష్ర్ట ప్రభుత్వం మొత్తం 4348 పోస్టులను మంజూరు చేసిందన్నారు. న్యాయశాఖకు మరింతగా సంపూర్ణ సహకారం అందించేందుకురాష్ర్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందన్నారు. డిజిటలైజేషన్‌ ఆఫ్‌ రెవెన్యూ రికార్డ్స్‌లో భాగంగా 1.52 కోట్ల ఎకరాల భూముల రికార్డులను డిజిటలైజ్‌ చేశామన్నారు. కోర్టులపై తమకున్న అపారమైన విశ్వాసం, నమ్మకంతోనే రెవెన్యూకోర్టులను రద్దు చేసి, లిటిగేషన్లను తెలంగాణ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేశామన్నారు. 30 ఎకరాల స్థలంలో 42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఒకే చోట క్వార్టర్స్‌ను నిర్మించబోతున్నామన్నారు. త్వరలోనే ఈ క్వార్టర్స్‌ శంకుస్థాపనకు జస్టిస్‌ రమణను ఆహ్వానిస్తామన్నారు. జస్టిస్‌ రమణ చొరవతో ఆల్టర్‌నెట్‌ డిస్ప్యూట్‌ మెకానిజం కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా ఇంటర్‌నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని, ఆ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. అంతర్జాతీయ వర్తక, వ్యాపార, వాణిజ్య ‘డిస్పోజల్‌’లో స్పీడు పెరిగినట్లయితే, మనం ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని, న్యాయమూర్తులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ర్ట న్యాయాధికారుల సదస్సులో రాష్ర్ట న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం, కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగంతో పాటు పలు అంశాలు చర్చకు రానున్నాయి. న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కల్పన, న్యాయమూర్తులు,అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించే చర్యలతో పాటు న్యాయ వ్యవస్థలో పని చేస్తున్న వారి సంక్షేమానికి తగు చర్యలు చేపట్టడం అనేక అంశాలు చర్చించనున్నారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments