ప్రజాపక్షం/ హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యను దాచిపెడుతున్నారని, హెల్త్ బులిటెన్‌లో వెల్లడిస్తున్న సంఖ్యలు వాస్తవం కాదని వస్తున్న ఆరోపణలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. మంగళవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసుల సంఖ్యను దాచిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే తమకేమైనా కిరీటం తగిలిస్తారా అని ఎదురుప్రశ్న వేశారు. కరోనా నిర్ధారిత పరీక్షలు సరిగా చేయడంలేదని ఆరోపణలు వస్తున్నాయని, ఉన్న లెక్కల ప్రకారమే సమాచారం ఇస్తున్నామన్నారు. ఎక్కడ తప్పుడు లెక్కలు చెప్పడం లేదని, విజ్ఞత గానే వచ్చిన కేసులు చూపెడుతున్నామని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మంగళవారం కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయినట్టు మంత్రి వెల్లడించారు. ఈ ఆరు పాజిటివ్ కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనే నమోదయ్యాయని వెల్లడించారు. గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది మృతి చెందినట్టు చెప్పారు. కరోనా నుంచి కోలుకుని మంగళవారం 42 మంది డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 374 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రకటించారు. ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మే 7 వరకు లాక్‌డౌన్ తప్పకుండా పాటించాలని ఈటల స్పష్టం చేశారు. తెలంగాణలో 22 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వాళ్లు లక్షల మంది ఉంటారని.. వారంతా ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే డబ్బులు దండుకునే అవకాశం ఉంది కాబట్టే ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇవ్వలేదని వివరించారు.తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్రం హర్షం వ్యక్తం చేసిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ముందుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజలు ఇదే స్ఫూర్తితో సహకరిస్తే, కరోనా నుంచి రాష్ట్రం త్వరలోనే బయటపడుతుందన్నారు.
కేసుల సంఖ్య దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు!
RELATED ARTICLES