HomeNewsBreaking Newsకేసులకు భయపడబోం

కేసులకు భయపడబోం

భూదాన్‌ భూమి కబ్జా కాకుండా భూపోరాటం ద్వారా అడ్డుకున్నాం
తుపాకులు పట్టుకున్నట్టుగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం
అర్హులైన వారికి భూ పంపిణీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌
భూదాన్‌ భూమి కబ్జా కాకుండా పేదలకు దక్కేందుకు ప్రయత్నిస్తే, తామేదో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నినట్టుగా, తుపాకులు పట్టుకున్నట్టుగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని, నిరంకుశత్వమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో భూదాన్‌ భూమి భూకబ్జా చేసే ప్రయత్నాన్ని భూపోరాటం ద్వారా అడ్డుకున్నామని స్పష్టం చేశారు. పోరాటంలో పాల్గొన్నందుకు తనతో పాటు పల్లా వెంకట్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మతో కలిసి హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. తాము కేసులకు భయపడేదే లేదని, తమతో పాటు మహిళలపై మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేయడాన్ని సాంబశివరావు ఖండించారు. కేసులు నమోదు చేసిన విషయం పాలకులకు తెలుసా? లేదా?, కిందిస్థాయి పోలీసులే అత్యుత్సాహంగా చేస్తున్నారా? తమకు తెలియదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని, అర్హులైన వారికి భూములు పంపిణీ చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. వరంగల్‌, హన్మకొండ, సంగారెడ్డి, భూపాల్‌పల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో ఇండ్ల స్థలాలు, పోడు భమూల సమస్యలపై పోరాటం చేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారంలో తాము వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు.
అర్థం, పర్థం లేకుండా మాట్లాడుతున్న రేవంత్‌
ప్రభుత్వ పాపాలను వామపక్ష పార్టీలు భరించాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూనంనేని సాంబశివరావు తప్పుపట్టారు. తాము సంయమనం పాటిస్తుంటే… రేవంత్‌రెడ్డి ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడంలేదని, అర్థం, పర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భూపోరాటాల్లో పోలీసులు తమపై కేసులు నమోదు చేశారని, ఆ కేసుల్లో కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామ్యాన్ని తీసుకుంటుందా?, వారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తారా? అని కూనంనేని నిలదీశారు. ప్రభుత్వ పాపాలను భరించేందుకు తాము టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో భాగస్వాములమా? అని ప్రశ్నించారు. కొన్ని అంశాల్లో మద్దతు మాత్రమే ఇచ్చామని ఆయన పునరుద్ఘాటించారు. తమ భాగస్వామం ఉన్నట్లయితే పేదలకు ఇండ్లే ఇప్పించేవారమని, కార్మికులకు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేవారమని చెప్పారు. మునుగోడు ఎన్నికల తర్వాత తనతో పాటు పల్లా వెంకట్‌రెడ్డిపై కూడా కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా పోరాటలు చేయకుండా, ఒక దగ్గర కూర్చుని కేవలం మాట్లాడేవారి తరహాలోనే రేవంత్‌ వ్యాఖ్యలు చేయవద్దని సాంబశివరావు హితువు పలికారు. కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అభ్యర్థుల పోరాటాన్ని తామే చేశామని, ప్రగతిభవన్‌ ముట్టడిలో ఎఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులే పాల్గొన్నారని వివరించారు. నాడు 2004 -09 కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షమైనప్పటికీ సిపిఐ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని, అప్పడు రేవంత్‌రెడ్డి వేరే పార్టీలో ఉన్నారని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాపాలను తాము భరించలేదని అన్నారు.
రేవంత్‌..రాజకీయ పరిజ్ఞానాన్నిపెంచుకో : చాడ
రాజకీయాలలో ఎలా మాట్లాడాలనే పరిజ్ఞానాన్ని రేవంత్‌రెడ్డి పెంచుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి హితువు పలికారు. కమ్యూనిస్టులు ఎవరి పట్ల పక్షపాతం వహించబోరని, ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చినప్పటికీ ‘బారా ఖూన్‌ మాఫీ’ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. 2004లో కాంగ్రెస్‌తో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే భూపోరాటం చేశామని, ఖమ్మం జిల్లా భూపోరాటంలో ఏడుగురు మరణించారని గుర్తు చేశారు. పేదల పక్షాన సిపిఐ చేస్తున్న పోరాటాలు రేవంత్‌ కళ్లకు కనిపించడం లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా అవాకులు, చెవాకులు పేలితే ఆత్మవంచన అవుతుందని సూచించారు. ఎన్నికల పొత్తులు వేరు, ప్రజా సమస్యలు వేరు అని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వెంకట్‌రెడ్డి విమర్శించారు. భూపోరాటంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. తాము దోపిడీ చేశామా?, దొంగతనం చేశామా? అని మండిపడ్డారు. భూదాన్‌ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుని రక్షించామన్నారు. పేదలకు వెంటనే భూమి పంపిణీ చేయాలని, పక్కా గృహాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

గవర్నర్‌ ‘ఎట్‌ హోమ్‌’ను బహిష్కరించిన సిపిఐ
గవర్నర్‌ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చీడ పురుగు లాంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గవర్నర్‌ వ్యవస్థనే రద్దు చేయాలని పోరాటం చేస్తున్న నేపథ్యంలో గవర్నర్‌ ఆహ్వానించిన ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమాన్ని తాము బహిష్కరించినట్లు ఆయన చెప్పారు. తమకు ఇష్టంలేని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గవర్నర్‌ వ్యవస్థ ఒక సాధనంగా ఉపయోగపడుతోందని ధ్వజమెత్తారు. తమిళనాడు, కేరళ, పంజాబ్‌, మహారాష్ట్ర, ఢిల్లీలో గవర్నర్‌ వ్యవస్థ ద్వారా కొన్ని ప్రభుత్వాలను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గవర్నర్‌ ద్వారా ఏదో పేరుతో అలజడులు సృష్టించి, ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించి, పార్లమెంట్‌ ఎన్నికల వరకు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. గవర్నర్‌ వ్యవస్థ వల్ల ప్రయోజనాల కంటే అనేక నష్టాలే ఉన్నాయని, రాజ్యాంగం మరింత ఫరిడవిల్లాలంటే రాజ్యాంగంలోని గవర్నర్‌ లాంటి చెడు అంశాలను సవరించాలని ఆయన సూచించారు. గవర్నర్‌ వ్యవస్థ ఒక అపెండిక్స్‌ లాంటిదని సాంబశివరావు అభివర్ణించారు. రాష్ట్రపతి వ్యవస్థ ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments