తిరువనంతపురం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పాలక వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్)కే పట్టం కట్టారు. లెఫ్ట్‌ఫ్రంట్ తన ఆధిపత్యాన్ని పూర్తిగా నిలుపుకున్నది. గ్రామపంచాయతీలు, కార్పొరేషన్లు, జిల్లా పంచాయతీల్లో ఎల్‌డిఎఫ్ ఆధిక్యత నిలబెట్టుకోగా, మున్సిపాలిటీల్లో మాత్రం యుడిఎఫ్ ఆధిక్యత సాధించింది. కేరళ స్థానికంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 7000 వార్డులు లక్ష్యంగా పనిచేసిన ఆ కూటమి కేవలం 2000 వార్డుల్లో మాత్రమే ప్రభావం చూపగలిగింది. ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌లు కుమ్మక్కయ్యాయని, శబరిమల ప్రతిష్ట దిగజారిందని…తదితర ఆరోపణలతో రాజకీయ లబ్దిపొందాలని బిజెపి యత్నించినప్పటికీ, మలయాళీలు విశ్వసించలేదు. 2015లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ, అద్భుత విజయం సాధించింది. ఈసారి అదే జోరును కొనసాగించింది. బుధవారంనాడు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, గురువారం సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 941 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, అందులో ఎల్‌డిఎఫ్ ఏకంగా 514 స్థానాల్లో జయభేరి మోగించింది. యుడిఎఫ్ 375 స్థానాలను దక్కించుకొని రెండోస్థానంలో నిలిచింది. ఇక ఎన్‌డిఎ కేవలం 23 గ్రామాల్లోనే గెలిచింది. ఇతర పార్టీలు, స్వతంత్రులు 29 స్థానాలను హస్తగతం చేసుకున్నారు. ఇక 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, అందులో ఎల్‌డిఎఫ్ 5 కార్పొరేషన్లు కైవసం చేసుకున్నది. యుడిఎఫ్ ఒకేఒక్క స్థానాన్ని దక్కించుకున్నది. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం కార్పొరేషన్‌తోపాటు కొల్లం, కొచిన్, త్రిస్సూర్, కోజికోడ్‌లలో ఎల్‌డిఎఫ్ విజయభేరి మోగించింది. కన్నూర్‌లో యుడిఎఫ్ గెలిచింది. ఇక 86 మున్సిపాలిటీల్లో యుడిఎఫ్‌కు 45 స్థానాలు లభించగా, ఎల్‌డిఎఫ్‌కు 35 స్థానాలు దక్కాయి. ఇక ఎన్‌డిఎకు రెండు మున్సిపాలిటీలు, ఇతరులకు నాలుగు మున్సిపాలిటీలు లభించాయి. జిల్లా పంచాయతీల్లోనూ లెఫ్ట్‌ఫ్రంట్ అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 14 జిల్లా పంచాయతీలకు గాను 11 జిల్లా పంచాయతీల్లో ఎల్‌డిఎఫ్ విజయం సాధించగా, యుడిఎఫ్ కేవలం మూడింటికే పరిమితమైంది. ఎన్‌డిఎకు ఒక్కటీ దక్కలేదు. తిరువనంతపురం, కొల్లం, పథనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్, కోజికోడ్, కన్నూర్, కాసరగోద్‌లలో లెఫ్ట్‌ఫ్రంట్ గెలుపొందగా, ఎన్నాకుళం, మలప్పురం, వాయనాడ్‌లలో యుడిఎఫ్ గెలిచింది. రాజధాని తిరువనంతపురంలో ఎల్‌డిఎఫ్ అన్ని స్థానాల్లోనూ తిరుగులేని విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా తిరువనంతపురం పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఎల్‌డిఎఫ్ ఎర్రజెండాను ఎగురవేసింది. అలాగే ఈ జిల్లా పరిధిలోని 73 గ్రామపంచాయతీల్లో 51 స్థానాలను వామపక్ష పార్టీలే దక్కించుకున్నాయి. బిజెపి మాత్రం తీవ్ర నిరాశ చవిచూసింది. కనీసం 10 మున్సిపాలిటీలపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, రెండింటికే పరిమితమైంది.
కేరళ స్థానికపోరులో విజేత లెఫ్ట్‌ఫ్రంట్
RELATED ARTICLES