సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : కేరళ రాష్ర్టంలో మాదిరిగా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ సహాయానికి అదనంగా వారి సంక్షేమ నిధి నుండి రూ.5000 ఇవ్వాలని, అసంఘటిత కార్మికులు, చేతివృత్తు ల కుటుంబాలకు రూ. 5000 చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సిఎం కెసిఆర్‌కు చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అర్హత ఉండి రేషన్ కార్డు లేని, రేషన్ కార్డు ఉండి కూడా నిరాకరింపబడిన వారికి 12 కిలోల బియ్యం, రూ. 1500 ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు శుక్రవారం నాడు ఆయన లేఖ రాశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 47 రోజులుగా నిరుపేదలు, చేతి వృత్తుల వాళ్ళు, అసంఘటిత రంగ కార్మికులు ఇండ్లకే పరిమితమై ఉంటున్నారని, 2, 3 నెలల నుండి రేషన్ తీసుకోలేదనే నెపంతో దాదాపు 9 లక్షల కు టుంబాలకు ప్రభుత్వ సహాయ చర్యల్లో భాగం గా ఇచ్చే 12 కిలోల బియ్యం, రూ. 1500 అందించలేదన్నారు. ఏ కార్డు లేని బిపిఎల్ కుటుంబాల వారికి బియ్యం, ఆర్థిక సహాయం అందించకపోవడం బాధాకరమని చాడ అన్నా రు. మరోవైపున భవన నిర్మాణ కార్మికులకు వారి సంక్షేమ నిధి నుండి రూ.1500 ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పట్టణాల లో ఆటో డ్రైవర్స్, మంగలి, లాండ్రీ, ఫుట్‌పాత్ దుకాణాలు తెరవకపోవడం వల్ల వారు కూడా పస్తులు ఉండే పరిస్థితి దాపురించిందన్నారు. కేరళ రాష్ర్టంలో కార్డు కలిగిన ప్రతి కుటుంబాుకి బియ్యంతో పాటు 17 రకాల నిత్యవసర వస్తువులు, రూ. 2000 ఆర్థిక సహాయం అందిస్తున్నారని, భవన నిర్మాణ కార్మికులకు దీనికి అదనంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి రూ.5వేల చొప్పున సహాయం ఇస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ఢిల్లీలో కూడా రూ.5వేలు, తమిళనాడులో రూ.3వేలు ఇస్తున్నారని, మన దగ్గర అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన నాటికి 8 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వం తీసుకోగా, ఈ మధ్యకాలంలో మరో ఐదులక్షల మంది సభ్యత్వం పొందినట్లు తెలుస్తుందన్నారు. వీరికి కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి రూ.1500 ఇస్తామని చెప్పి, తెల్లకార్డు ద్వారా వచ్చే బియ్యం, రూ.1500తోనే సరిపెట్టారని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ సహాయానికి అదనంగా భవన నిర్మాణ కార్మికులకు వారి నిధి నుండి ఆర్థిక సాయం చేస్తే, మన రాష్ర్టంలో ఆ నిధి నుండి డబ్బులను ఖజానాకు మళ్ళించి, భవన కార్మికులకు అదనపు సాయం చేయకపోవడం అర్థరహితమని సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది భవననిర్మాణ సంక్షేమ నిధి ఏర్పాటు స్ఫూర్తికే విరుద్ధమన్నారు. కేరళ, కర్నాటకలో ఆటో డ్రైవర్లు, ఇతర చేతివృత్తుల వారికి, అసంఘటిత కార్మికులకు, ప్రత్యేక ప్యాకేజీలు అమలుచేస్తున్నారని, నిరుపేదల ను ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారో పరిశీలించి, మన దగ్గర అమలు చేయాలని చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేరళ తరహాలో భవన నిర్మాణ కార్మికులకు రూ. 5000 ఇవ్వాల్సిందే
RELATED ARTICLES