బాలుడి మృతి
పరిశీలనకు కేంద్ర బృందం
న్యూఢిల్లీ : కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతున్నది. ఇటీవల ఈ వైరస్ ఆందోళనలు రేపినప్పటికీ, ఆతర్వాత ఉధృతి తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మళ్లీ కేసులు పెరగడం, ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో 12 ఏళ్ల బాలుడు ఈ వైరస్ బారినపడి మృతి చెందడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. పరిస్థితిని సమీక్షించడంతోపాటు, తీవ్రతను అధ్యయనం చేసి, సలహాలు, సూచనలు అందించేందుకు కేంద్ర బృందం న్యూఢిల్లీ నుంచి బయలుదేరింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) బృందం కేరళకు చేరుకొని, అధికారులకు అవసరమైన సహాయం చేస్తుంది. ఇలావుంటే, నిఫా వైరస్‌తో మృతి చెందిన బాలుడు కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ సమయంలో అతని రక్తం నమూనాలను వైద్యులు పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. అక్కడ పరీక్షలు జరిపిన అనంతరం ఆ బాలుడికి నిఫా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ బాలుడ్ని కాపాడలేకపోయారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన అధికాఉలు సదరు బాలుడితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పటికే కొంత మందిని గుర్తించి, వారిని ఐసోలేషన్‌కు పంపారని సమాచారం. నిఫా వైరస్ కేరళలో కొత్తకాదు. 2018లో జూన్ మాసంలోనే దీని ఉనికిని కనుగొన్నారు. ఇప్పటి వరకూ 23 కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా థర్డ్‌వేవ్ విరుచుకుపడుతుందని, ఆ సమయంలో వివిధ మ్యూటెంట్లు, వైరస్‌లు చిన్నారులపై పంజా విసురుతుంపదని వస్తున్న వార్తలు ఆందోళనకు కారణమవుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రస్తుత తరుణంలో నిఫా వైరస్ ఉనికి ప్రజలను భయపెడుతున్నది.
కేరళలో ‘నిఫా’ కలకలం
RELATED ARTICLES