కనీసం 12 మంది ఉండాలి
తక్షణం గవర్నర్ జోక్యం చేసుకొని కేబినెట్ విస్తరణకు ఆదేశించాలి
ఎఐసిసి అధికార ప్రతినిధి శ్రవణ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాజ్యాంగంలోని 163, 164 అధికరణల ప్రకారం కేబినెట్‌లో కనీసం 12 మంది మంత్రులు ఉండాలని, ప్రస్తుతం కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకొని మంత్రివర్గ విస్తరణకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. మంత్రుల నియామకం ప్రజల ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశమని, ఇది రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, దీన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బేఖాతర్ చేస్తున్నారని చెప్పారు. కనీసం రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో ప్రభుత్వం నడవడం లేదని, గవర్నర్‌కు తన కార్యకలాపాలలో సహాయకులుగా ఉండాల్సిన మంత్రులు లేకపోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి మాత్రమే ప్రమాణస్వీకారం చేశారని, హోం మంత్రికి ఎలాంటి నిర్ణయాధికారాలు లేవని, ముఖ్యమంత్రి ఫెడరల్ రాజకీయాలు, పూజలు, పునస్కారాల పేరిట కాలం వెళ్లదీస్తున్నారని డాక్టర్ శ్రవ ణ్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 33 శాఖలు, 298 విభాగాలు ఉన్నాయన్నాయని కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక మంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారని ఆయనకు నాలుగుశాఖలు మాత్రమే కేటాయించారన్నారు.అయినానిర్ణయాధికారం ముఖ్యమంత్రి చేతిలోనే ఉందని శ్రవణ్ ఆరోపించారు.