ప్రజాపక్షం/హైదరాబాద్: ఈసారి బడ్జెట్‌లో పలు పథకాలకు భారీగానే నిధులు కేటాయించారు. కానీ, అవి ఎంత వరకు ఖర్చు చేస్తారనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో నిరుద్యోగభృతి, ఎంబిసి కార్పొరేషన్, స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం వంటి పథకాలకు నిధులు కేటయించారు. కానీ నయా పైసా ఖర్చు పెట్టలేదు. దీంతో ఈసారి భారీ బడ్జెట్ ఎంత వరకు ఆచరణలో పెడతారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిధులు కేటాయించి, విడుదల చేయని పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.
సొంతింటి సాయం కలే..2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఆర్థిక సాయం చేస్తామని టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకోసం లబ్ధిదారులకు రూ.5 లక్షల నుండి రూ.6 లక్షలు మేరకు ప్రభుత్వం ద్వారా సాయం అందజేస్తామని పేర్కొంది. ఆ ఎన్నికల్లో గెలిచాక 2019- ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినప్పుడు అలా ఇళ్ళు కట్టుకోవాలనుకునే వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసే పక్రియను చేపడుతామని కూడా సిఎం నాటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో స్వయంగా చెప్పారు. అయితే, నిధులు మాత్రం కేటాయించలేదు. ఈ ఏడాది కాలంలో ఆ ఊసే ఎత్తలేదు. తాజాగా 2020 ఆర్థిక బడ్జెట్‌లో కూడా లక్ష మంది లబ్ధిదారులకు తమ సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని బడ్జెట్‌లో ప్రకటించారే తప్ప, ఎలా ఏమిటి అనే విషయం చెప్పలేదు. ఇదే విషయాన్ని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రిని మీడియా ప్రశ్నించగా, ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదన్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో జిహెచ్‌ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పూర్తిపైనే దృష్టి పెట్టింది. దీంతో ఎంత వరకు సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారికి ఆర్థిక సాయం చేస్తారో వేచి చూడాలి.
కేటాయింపులు సరే… ఖర్చు పెడతారా?
RELATED ARTICLES