HomeNewsNationalకేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా 31న ఢిల్లీలో ‘ఇండియా’ ర్యాలీ

కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా 31న ఢిల్లీలో ‘ఇండియా’ ర్యాలీ

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఈనెల 31వ తేదీన ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రకటించింది. లిక్కర్‌ కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌, బిఆర్‌ఎస్‌ నాయకురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితసహా ఇప్పటి వరకూ 16 మందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేయడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆయన అరెస్టును నిరసిస్తూ ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ’మహా ర్యాలీ’ నిర్వహించనుందని ఆప్‌ నాయకుడు, ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్షాల ఐక్యత, బలప్రదర్శనే లక్ష్యంగా ఈ నిరసన ఉండనుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగే ర్యాలీలో పాల్గొనాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తీరు, రాజ్యాంగాన్ని ప్రేమించే, గౌరవించే దేశ ప్రజలందరి హృదయాల్లో ఆగ్రహావేశాలు తెప్పించాయని రాయ్‌ అన్నారు. ‘కేవలం కేజ్రీవాల్‌ గురించే కాదు. మొత్తం ప్రతిపక్షాన్ని ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తున్నారు. ప్రధాని మోడీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. బిజెపిలో చేరాలని బెదిరిస్తున్నారు. అమ్మడానికి సిద్ధంగా లేని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ నియంతృ పాలనకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడాని ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments