ప్రజాపక్షం / హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తమ పార్లమెంటేరియన్ సుదిని జైపాల్ రెడ్డి హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా నిమోనియా తో బాధపడుతున్న ఆయన ఈ నెల20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడ చికిత్సపొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తెల్లవారు జామున 1:28 గంటలకు తుదిశ్వాస విడిచారు.
జీవిత సంగ్రహం : రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా మాడుగులలో సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు 1942 జనవరి 16న జైపాల్ రెడ్డి జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ లిటరేచర్ ఇంగ్లీష్, బిసిజె చదువకున్నారు. కాంగ్రెస్ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీలో ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
ఐదుసార్లు ఎంపి, నాలుగు సార్లు ఎంఎల్‌ఎగా
1969 సంవత్సరంలో తొలిసారి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన జైపాల్ రెడ్డి నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1984లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.1990,1996 లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికకాగా, జూన్ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు.1969- వరకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరపున ఎంఎల్‌ఎగా గెలుపొందారు. ఆ తర్వాత 1984 సంవత్సరంలో టిడిపి పొత్తుతో మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యునిగా విజయం సాధించా రు.1998లో కూడా మహబూబ్ నగర్ ఎంపిగా గెలిచారు. అనంతరం 1999- సంవత్సరంలో మిర్యాలగూడ నుం చి ఎంపిగా గెలుపొందగా, 2009 సంవత్సరంలో చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేసి మరోసారి ఎంపిగా విజయం సాధించారు.1999 సంవత్సరం వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నాటి ప్రధానమంత్రి ఐ.కె. గుజ్రాల్ మంత్రివర్గంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 సంవత్సరం, 2009 సంవత్సరంలో రెండు పర్యాయాలు యుపిఎ ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశారు. ఇదిలా ఉండగా 1980 సంవత్సరంలో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాటి ఇందిరాగాంధీపై పోటీ చేశారు. కాగా జైపాల్‌రెడ్డి 1998 సంవత్సరంలో ఉత్తమ పార్లమెంటరీయన్ పురస్కారాన్ని అందుకున్నా రు. దక్షిణాది రాష్ట్రాల నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందుకున్న నేతగా జైపాల్ రెడ్డి గుర్తింపు పొందారు.
తెలంగాణ రాష్ట్ర బిల్లులో కీలక పాత్ర
తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, ఉద్యమకారులకు మధ్య జైపాల్ రెడ్డి సంధానకర్తగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవశ్యకతను, ఇందుకు సంబంధించిన అనేక అంశాలను ఆయన కేంద్ర ప్రభుత్వం, యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యస్తీకరణ బిల్లు ఆమోదం విషయంలో కూడా జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. యుపిఎ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అనేక సందర్బాల్లో ఆయన తనను కలిసిన ఉద్యమకారులకు, కాంగ్రెస్ నేతలకు, నాటి రాష్ట్ర మంత్రులకు భరోస ఇచ్చారు.
నేడు అధికారికంగా అంత్యక్రియలు:
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో సోమవారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జైపాల్ రెడ్డి అధికారిక అంత్యక్రియల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ని ఆదేశించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని మాజీ ప్రధాని పి.వి నరసింహారావు ఘాట్‌కు తూర్పున జైపాల్ రెడ్డి స్మృతి ఘాట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్ధం జైపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 10ః 30 గంటల నుంచి 12 గంటల వరకు గాంధీభవన్‌లో ఉంచుతారు. అక్కడి నుంచి అంతిమయాత్ర నెక్లెస్ రోడ్ వరకు కొనసాగుతుంది. సుమారు మధ్యాహ్నాం 1 గంటలకు పి.వి. ఘాట్ సమీపంలో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి.