మారుతున్న సమీకరణాలతో రాష్ట్ర సర్కార్ తర్జన భర్జన!
పెండింగ్‌లో బైసన్ పోలో మైదానం అప్పగింత
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ భూసేకరణ బాధ్యత రాష్ట్రానిదేనంటున్న కేంద్రం
ముందుకు సాగని హైదరాబాద్ ఫార్మాసిటీ పనులు
హైదరాబాద్ : కేంద్రంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే సర్కార్ కొలువు దీరనుండడంతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా పలు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం శర వేగంగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణం కోసం సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో మైదానం కావాలని చేసిన ప్రతిపాదనపై కేంద్రం వైపు నుండి గడచిన నాలుగైదేళ్లుగా సానుకూల స్పందన రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. భూమికి భూమి ఇస్తామన్నా గానీ రకరకాల కొర్రీలు పెడుతూ ఈ మైదానం భూమి అప్పగింతపై సాగతీత వైఖరిని అవలంభించిందని చెబుతోంది. బైసన్ మైదానం ఇస్తారన్న ఉద్దేశంతోనే ప్రస్తుత సచివాలయంలోని వివిధ బ్లాకుల్లో కొనసాగుతున్న ప్రభుత్వశాఖల కార్యాలయాలను సచివాలయం సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు, గాంధీభవన్ ఎదుటనున్న గగన్ విహార్, చంద్రవిహార్, గృహకల్ప కాంప్లెక్స్‌లోకి తరలించాలని యోచించారు. అయితే బైసన్ పోలో మైదానం అప్పగింతపై కేంద్రం స్పష్టత ఇవ్వక పోవడంతో సచివాలయ తరలింపు ప్రతిపాదన తాత్కాలికంగా నిలిచిపోయింది.ఒక్క బైసన్‌పోలో మైదానం అంశం మాత్ర మే కాదు, కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పలు పనులు పెండింగ్‌లోనే ఉండి పోయాయి. ఉదాహరణకు.. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు కేంద్రం సహకరించాలని అప్పటి పరిశ్రమల శాఖమంత్రి , ప్రస్తుత టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటి. రామారావు పలు సందర్భాల్లో కోరుతూ వచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ యూనియన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రతిసారీ కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశం ప్రస్తావనకు రాకపోవడంతో ఈ కోచ్ ఫ్యాక్టరీ కథ కంచికి చేరినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే కేంద్ర ప్రభుత్వం మా త్రం ఇందుకు భిన్నమైన వాదన వినిపించింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వ మే ఇందుకు కలిసి రాలేదని, 150 ఎకరాల భూమి ఇందుకు అవసరం కానుందని, ఈ భూసేకరణ బాధ్యత కూడా రాష్ట్ర సర్కార్ చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వ ఎక్స్ అఫీసియే సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ ఇటీవల వెల్లడించడం గమనార్హం. ఇక అంబర్‌పేట ఫ్లు ఓబర్ బ్రిడ్జ్ పనులూ కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడి ఉంది. అంబర్‌పేట, ఉప్పల్ అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతం అధికార పార్టీ కైవసం చేసుకోవడం, ఇక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎంఎల్‌ఎలు భారతీయ జనతాపార్టీకి చెందిన వారు కావడంతో ఈ పనుల కొనసాగింపుపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తమ నిధులతో చేపట్టే పనులు కూడా అధికార పార్టీ తమ ఖాతాలో వేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గానే తీసుకుంటోంది.ఈ కారణంగా అంబర్‌పేట ఫ్లు ఓవర్ పనులు రెండేళ్లలోనే పూర్తి అవుతాయా? లేక నిలిచి పోతాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి నితిన్ గడ్కరీ అంబర్‌పేట ఫ్లు ఓవర్‌పనులకు శంకుస్థాపన చేసి కూడా ఏడాది పూర్తి అయింది. ఇంకా అక్కడ భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరుగుతున్న పనుల తీరుతెన్నులకు నిదర్శనంగా చెప్పవచ్చు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల కేంద్రంగా నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీకి ఇన్‌ప్రిన్సిపుల్ అప్రూవల్ మాత్రమే కేంద్రం ఇచ్చింది. ఇంకా పూర్తి స్థాయి అనుమతులు జారీ చేయలేదు.అదేమని అడిగితే భూసేకరణ ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే చేయలేదని కేంద్రం నుండి సమాధానం వస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని విలువైన భూములకు రాష్ట్ర సర్కార్ మాత్రం ప్రభుత్వ ధరల ప్రకారమే కాం పెన్షేషన్ కట్టించడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. రంగారెడ్డి కలెక్టర్ ఇప్పటి వరకు పలు సందర్భాలుగాఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతులను బుజ్జగించేందుకు యత్నించినా వారు ససేమిరా అన్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌళికసదుపాయాల కల్పన సంస్థ టిఎస్‌ఐఐసి కూడా రంగంలోకి దిగి స్థలాలు ఇచ్చే రైతులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వైపు నుండి ఇంకా ఏమైనా చేస్తామని హామీలు ఇచ్చినా వారు మొత్తబడలేదు. దీంతో ఫార్మాసిటి మూడడులు ముందుకు,ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. తాజా లోక్‌సభ ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం అనుసరించే వైఖరిని బట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్‌సంబంధాలు కొనసాగుతాయని, లేని పక్షంలో నువ్వెత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితులుఉంటేఈ ప్రాజెక్టులు అటకెక్కినట్లేనని పలువురు విశ్లేషిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంతో కయ్యమా? నెయ్యమా?
RELATED ARTICLES