టిఆర్‌ఎస్ 16 సీట్లు గెల్చుకుంటుంది
ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో కెటిఆర్ సంభాషణ
ప్రజాపక్షం/హైదరాబాద్: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోయే మెజార్టీ రాదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు అన్నా రు. టిఆర్‌ఎస్ మొత్తం 16 సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. “ఆస్క్ కెటిఆర్” హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్విట్టర్ వేదికగా ఆదివారం నెటిజన్లతో కెటిఆర్ సంభాషించారు. వారు అడిగన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కేంద్ర పన్నులో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్ ఫ్రంట్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని, తద్వారా రాష్ట్రాలు బలోపేతమవుతాయని, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతోనే దేశంలో ఉద్యోగ, సంపద సృష్టి జరుగుతుందన్నారు. ఉత్తమ ఆర్థిక విధానాలే రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలో ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రారంభమైన పంపులో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండలోని కొన్ని ప్రాంతాలో వ్యవసాయానికి నీరు అందుతుందన్నారు. రెండవసారి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వైద్యం, ఆరోగ్యం, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. రాబోయే కేంద్ర ప్రభుత్వమైనా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ మేరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామన్నారు. గత ఎన్‌డిఎ ప్రభుత్వం హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ నెట్‌వర్క్ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని, కనీసం రాబోయే కేంద్ర ప్రభుత్వమైనా అన్యాయాన్ని సరిదిద్దుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పోటీ చేయాలన్న నెటిజన్ల ప్రశ్నకు 2024 చాలా దూరంలో ఉందని చమత్కరించారు. తమిళనాడులో టిఆర్‌ఎస్‌పార్టీని విస్తరించాలని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికే అక్కడ చాలా మంది నాయకులు ఉన్నారన్నారు.