కోల్‌కతా బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్‌లో వామపక్షాల భారీ ర్యాలీ
పెద్దసంఖ్యలో హాజరైన జనం, ఎరుపెక్కిన హౌరా
కోల్‌కతా : కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని వామపక్షాల నేతలు విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా జనం పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. వామపక్షాల సారథ్యంలో ఆదివారంనాడు కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ మైదానంలో భారీ ర్యాలీ జరిగింది. ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్ కార్యకర్తలు ఎర్రజెండాలతో ఉరుకులు, పరుగులతో కోల్‌కతాను ఎరుపుమయం చేశారు. ముఖ్యం గా హౌరాబ్రిడ్జి ఎర్రదండు ప్రదర్శనతో ఎరుపెక్కింది. నాలుగువైపుల నుంచి ప్రజలు ఎర్రజెండాలు, బ్యానర్లు చేబూని మైదానానికి చేరుకున్నారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య, లెఫ్ట్‌ఫ్రంట్ నేత బిమన్ బోస్, ఆర్‌ఎస్‌పి, ఫారార్డ్‌బ్లాక్ నేతలు పాల్గొని ప్రసంగించారు.
అలాంటి కాపాలాదారుడు మనకు అక్కర్లేదు : ఏచూరి
‘దేశానికి కాపలాదారుడు(చౌకీదార్) అని చెప్పుకుంటున్న ప్రధాని నేతృత్వంలో లూటీ, మతతత్వం పెరిగిపోతున్నాయి. కేంద్రంలో తగిన ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తీసుకురావలసి ఉంది’ అని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి అన్నారు.‘వచ్చే ఎన్నికల్లో ఈ చౌకీదార్ మోడీని ఓడించాల్సి ఉంది. ఇలాంటి కాపలాదారుడు మనకవసరంలేదు. వారు దేశంలో మతతత్వ విషాన్ని వ్యాపింపచేస్తున్నారు’ అన్నారు.‘గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం లూటీ చేసింది. ఇప్పు డు ఎన్నికల ముందు వారాలు కురిపిస్తోంది’ అని చెప్పారు. అన్ని విధాల దేశం అభివృద్ధి చెందాలంటే విధానాల్లో మార్పు అవసరం అని పేర్కొన్నారు. ‘మోడీ అంటే ఇష్టంలేక మేము ఆయన ఓటమిని కోరుకోవడంలేదు. మార్పు కోసం కోరుకుంటున్నాం. ప్రత్యామ్నాయ విధానాల కోసం మోడీ ఓటమిని కోరుకుంటున్నాం. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక, ప్రజాస్వామ్య విలువలున్న ప్రభు త్వం ఏర్పడేందుకు మేము పోరాడతాం’అని చెప్పుకొచ్చారు. బడ్జెట్ గురించి మాట్లాడుతూ‘అదంతా శుష్క వాగ్దానాలతో కూడుకున్నదేనని, ప్రజలు ఆ బూటకపు వాగ్దానాలకు వెర్రివాళ్లు కాకూడదు’ అని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన దుయ్యబట్టారు. ‘కాషాయ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి పార్టీ రెండూ కూడా ఒకే నాణేపు రెండు పార్శాలు’ అన్నారు. ‘పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టిఎంసిని, కేంద్రంలో బిజెపిని ఓడించాల్సి ఉంది’ అని ఏచూరి ఈ సందర్భంగా చెప్పారు.