HomeNewsBreaking Newsకెసిఆర్‌ సర్కార్‌ అవినీతిఢిల్లీవరకు పాకింది!

కెసిఆర్‌ సర్కార్‌ అవినీతిఢిల్లీవరకు పాకింది!

‘విజయ సంకల్ప’ సభలో ప్రధాని మోడీ విమర్శ
దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమని అభినందనలు
రాష్ట్రాభివృద్ధికి లక్షలకోట్లకు పైగా నిధులిచ్చామని వెల్లడి
ప్రజాపక్షం/వరంగల్‌ ప్రతినిధి
దేశంలోనే సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని, కెసిఆర్‌ సర్కార్‌ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హనుమకొండ జిల్లా హనుమకొండ పట్టణంలోని ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తుంటాయి కానీ తొలిసారిగా రెండు రాష్ట్రాలు అవినీతి కోసం పనిచేస్తుండటం దౌర్భాగ్యమన్నారు. యువత ఆత్మబలిదానాలు చేసింది ఇలాంటి అవినీతిని చూసేందుకేనా, కాంగ్రెస్‌ అవినీతి పాలనను దేశమంతా చూసిందని, కెసిఆర్‌ అవినీతి పాలనను తెలంగాణ చూస్తోందన్నారు. టిఎస్‌పిఎస్‌సిలో ఉద్యోగాల భర్తీలో అవకతవకల గురించి అందరికీ తెలిసిందేనని, వీరి అవినీతితో విద్యార్థుల భవిష్యత్‌ దెబ్బతింటోందన్నారు. కెసిఆర్‌ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి యువతను మోసం చేసిందని అన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలో మూడు వేల అధ్యాపకుల పోస్టులు, పాఠశాలల్లో 15 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగ విద్యార్థులకు ద్రోహం చేశారని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని ప్రధాని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్‌లందరూ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తోందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇచ్చామని, రైల్వే వ్యాగన్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని మోడీ వివరించారు. కెసిఆర్‌ ప్రభుత్వం నాలుగే నాలుగు పనులు చేస్తోందని, ఒకటి మోడీ ప్రభుత్వాన్ని తిట్టడం, కుటుంబ పార్టీని పెంచి పోషించడం, తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తూ అవినీతిలో నెంబర్‌వన్‌ స్థానానికి తీసుకెళ్లడమేనని విమర్శించారు. దళితులు, ఆదివాసీలను కెసిఆర్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని, ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక )
సదుపాయాలు కల్పించడంలేదని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో వారి అభివృద్ధి కోసం రహదారులు వేస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. మన బిడ్డల భవిష్యత్‌ కోసం రానున్న తరాల కోసం తెలంగాణ ప్రజలు బిజెపిని ఎన్నుకోవాలని కోరారు. ఉద్యమ సమయంలో హామీలు ఇచ్చిన కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధానిని తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి మర్చిపోయిందన్నారు. ఎక్కడ ప్రాజెక్టు కట్టినా అవినీతి తప్ప ఏమీ లేదని మోడీ విమర్శించారు. కుటుంబ పాలన కొనసాగిస్తున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సర్పంచులను ఇబ్బందులు పెడుతుందని, వారు సైతం బిఆర్‌ఎస్‌ సర్కార్‌పై కోపంగా ఉన్నారన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలేనని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు బిజెపి ట్రైలర్‌ చూపించామని త్వరలో తెలంగాణలో అధికారం ఖాయమన్నారు.
దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం పాత్ర కీలకం
దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం పాత్ర కీలకంగా మారిందని, ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో తెలంగాణ రాష్ట్రం ప్రధాన భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు. భద్రకాళి మాత ఆశీస్సులతో, సమ్మక్క సారలమ్మల వీరత్వం, రాణిరుద్రమాదేవి పరాక్రమంతో ఖ్యాతిగాంచిన వరంగల్‌కు రావడం తనకు సంతోషంగా ఉందని ముందుగా తెలుగులో ప్రధాని మోడీ ప్రసంగించారు. వ్యాక్సిన్ల తయారీలో తెలంగాణ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. పెట్టుబడుల ద్వారా ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని, కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తున్నదన్నారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల పత్తా లేకుండా చేస్తామని మోడీ అన్నారు. సభలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరి, జి.కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ఇంచార్జ్‌ తరుణ్‌చుగ్‌, ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రకాష్‌ జావదేకర్‌, ఎంపిలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాబురావు, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్‌, నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, డికె.అరుణ, ఎ.పి.జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
భద్రకాళి దేవాలయాన్ని సందర్శించిన ప్రధాని
వరంగల్‌ టౌన్‌ : వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రకాళి దేవాలయాన్ని దర్శించుకున్నారు. హెలికాఫ్టర్‌ ద్వారా మామునూరు హెలిప్యాడ్‌ వద్దకు శనివారం ఉదయం 10.12 గంటలకు చేరుకున్నారు. ఉదయం 10.36 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గంలో భద్రకాళి దేవాలయ ఆవరణకు చేరుకోగా ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ప్రధాని గోసేవలో పాల్గొని ఆవులకు గ్రాసం తినిపించారు. అనంతరం భద్రకాళి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శేషుభారతి,ప్రధాన అర్చకులు శేషు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు భద్రకాళి ఆలయం నుంచి ఆర్ట్‌ కళాశాలకు వెళ్లారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments