HomeNewsBreaking Newsకెసిఆర్‌ సార్‌... ఇదేందీ..!

కెసిఆర్‌ సార్‌… ఇదేందీ..!

పార్టీ కార్యాలయానికి అసైన్డ్‌ భూమి కబ్జా
రెవెన్యూ శాఖ ఇచ్చింది ఎకరం… కబ్జా చేసింది మరో అర ఎకరం
కబ్జా భూమి విలువ రూ.7.26 కోట్లు
పెదవి విప్పని అధికారులు
కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని జనగామ ప్రజల డిమాండ్‌
ప్రజాపక్షం/జనగామ బ్యూరో  “అసైన్డ్‌ భూమి కబ్జా చేస్తే ఆరేండ్లు జైలు. ఇది అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టం (పిఓటి) 1977 చెబుతోంది”. ఇంత వరకు బాగానే ఉన్నా… అధికారంలో ఉండి చట్టాలను అమలు చేయాల్సిన వారే అక్రమణలు చేస్తుండడం గమనార్హం. జనగామలో టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి రెవెన్యూ శాఖ కేటాయించింది కాకుండా మరో అర ఎకరం భూమి కబ్జా చేసి ఏకంగా ప్రహారీ గోడ నిర్మించారు. దీని విలువ సుమారు రూ.7.26 కోట్లు ఉంటుందని అంచ నా. ఇది చూసిన, విన్న జనం“సిఎం కెసిఆర్‌ సారూ ఇదేంటి. దీనికి మీరా…మీ మంత్రులా ఎవరు సమాధానం చెబుతారు’ అని ప్రశ్నిస్తున్నారు. జనగామలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భూ కబ్జాపై ‘ప్రజాపక్షం’ ప్రత్యేక కథనం. జనగామ జిల్లాలో టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ లేఖ ఇవ్వగా హన్మకొండ -హైదరాబాద్‌ జాతీయ రహాదారి పక్కన యశ్వంతాపూర్‌ సమీపంలో రహమాన్స్‌ బిఇడి కళాశాలకు ఆనుకుని ఉన్న ఎకరం ప్రభుత్వ భూమి (సర్వే నెంబర్‌ 82/15/1, 16/1, 17/1లలో ఉన్న భూమి) కేటాయించారు. భూమి కేటాయించనందుకు గజానికి రూ.100 ల చొప్పున రూ.4.84 లక్షలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెల్లించింది. రెవెన్యూ శాఖ కేటాయించిన ఎకరం స్థలంలోనూ టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణం చేయాల్సి ఉండగా పక్కనే ఉన్న అర భూమిని సైతం కబ్జా చేసి ప్రహరిగోడను నిర్మించారు. తాటి చెట్లు జెసిబితో తొలగించారు. నీటి సరఫరా కోసం బోరు వేయించారు. రెహమాన్‌ బిఇడి కళాశాల వైపు ఉండాల్సిన దారిని జాతీయ రహాదారి వైపు మలిపి సిసి రోడ్డు వేశారు. పేదొడి ఇంటికి 60 గజాల స్థలం ఇవ్వలేని ప్రభుత్వ పెద్దలు తమ పార్టీ కార్యాలయానికి మాత్రం ఎకరాల కొద్దీ భూమి కబ్జా చేస్తున్నారని గతంలో ఈ భూమిలో సాగు చేసిన రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. కార్యాలయ నిర్మాణానికి జరిగిన శంఖుస్థాపన కార్యక్రమంలో పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జిల్లాలోని ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు హజరు కావడం, వారి కనుసన్నల్లోనే కబ్జా చేసిన భూమిలో నిర్మాణం జరగడంగమనార్హం. పార్టీ కార్యాలయం ప్రహరీగోడ నిర్మించిన స్థలం తమకు కేటాయించింది కాదనే విషయం మరీ మంత్రికి తెలియదా అని మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే చట్టాలను దిక్కరించడం ఏమిటని విమర్శలు వెళ్లువెత్తున్నాయి. వెంటనే ప్రహారి తొలగించి ప్రభుత్వానికి భూమి అప్పగించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.
భూమిని స్వాధీనం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్‌ స్పందించి కబ్జాకు గురైన అర ఎకరం భూమిని స్వాధీనం చేసుకోవాలని జనగామ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి భూములు లేవని చెబుతున్న అధికారులకు అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం ఆందోళన చేయడానికి సిద్దమవుతున్నాయి. టిఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభానికి ముందే కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.
అర ఎకరం భూమి ఇవ్వలేదు : తహాసీల్దార్‌ రవీందర్‌
‘టిఆర్‌ఎస్‌ కార్యాలయం నిర్మాణానికి ఎకరం భూమిని మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మరో అర ఎకరం భూమి ఇవ్వలేదు. అయితే పార్టీ కార్యాలయం పక్కనే ఉన్నందున తమకే కేటాయించాలని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి లేఖ ఇచ్చారు. ఆ లేఖను ఉన్నతాధికారులకు పంపాం. అక్కడి నుండి ఎలాంటి అనుమతులు రాలేదు. చుట్టు ప్రహారి గోడ నిర్మాణం చేసిన విషయం తెలియదు. కేటాయించక ముందే ప్రహరిగోడ నిర్మాణం చేసి ఉంటే అది సరియైంది కాదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం’ అని తహాసీల్దార్‌ రవీందర్‌ ‘ప్రజాపక్షం’ ప్రతినిధికి తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments