రైతు చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయాలి
సిఎంకు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క లేఖ
చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. తక్షణం శాసనసభను సమావేశ పరిచి చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపాలని లేఖలో సిఎల్‌పి పక్షాన కోరినట్లు చెప్పారు. విద్యుత్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినట్లుగానే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను మొదట్లో వ్యతిరేకించిన కెసిఆర్ అందుకు అనుగుణంగా భారత్‌బంద్‌లో మంత్రులు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారన్నారు. అయితే కెసిఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చాక వ్యవసాయ చట్టాలపై యుటర్న్ తీసుకున్నారని భట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కెసిఆర్ నిర్ణయంతో రాష్ర్ట రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని పేర్కొన్నారు. వ్యక్తి గత అవసరాల కోసం రాష్ర్ట రైతాంగాన్ని మోడీ కాళ్ల దగ్గర పెట్టడం మంచిది కాదని భట్టి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు తొలగిస్తామంటే సహించేది లేదన్నారు. రాష్ర్ట ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
కెసిఆర్ యుటర్న్
RELATED ARTICLES