అమరావతి: హైదరాబాద్ నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీగా అభివృద్ధి చేశామని, సైబరాబాద్ తమ విజన్ వల్లే వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కెసిఆర్ హైదరాబాద్‌లో ఫాంహౌజ్ తప్ప ఏం కట్టారు? అని ప్రశ్నించారు. శుక్రవారం నాడు అమరావతి ప్రజావేదికలో రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ అప్పట్లో హైదరాబాద్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు నడపడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి 5వేల ఎకరాలు అవసరమా? అని ఆ రోజు ప్రశ్నించారని బాబు చెప్పారు. ఇప్పుడు అమరావతికి అవే ఇబ్బందులు పడుతున్నామని, హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు నేను సాధించిందేనని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో అమరావతికి కూడా అంతర్జాతీయ విమాన సర్వీసలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక విజన్‌తో నాడు హైదరాబాద్‌ని అభివృద్ధి చేశానన్నారు. మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో తీసుకురావడంలో చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. చెప్పినదానికి, చేసినదానికి పొంతనలేకుండా పాలన సాగిస్తే ప్రజల్లో అసహనం తప్పదని చంద్రబాబు అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా కేంద్రంలో నరేంద్రమోదీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మోడీపై ప్రజలు ఆరోజు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఇప్పుడంత నిరాశలో కూరుకుపోయారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.16వేల కోట్లు ఖర్చుపెట్టామని.. జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ హయాంలోనే గుర్తించిందని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా నిర్మించాలని ప్రణాళిక సంఘం సిఫారసు చేసిందన్నారు. దేశ రాజకీయాలు రాష్ట్రం మీద ఎంతో ప్రభావం చూపుతాయని, దేశం బావుంటే రాష్ట్రం కూడా బావుంటుందని స్పష్టం చేశారు.
కెసిఆర్ ఫాంహౌజ్ తప్ప ఏం కట్టారు
RELATED ARTICLES