HomeNewsBreaking Newsకెసిఆర్‌, జగన్‌ దూరం.. దూరం!

కెసిఆర్‌, జగన్‌ దూరం.. దూరం!

బలాన్ని చేకూరుస్తున్న తాజా పరిణామాలు
ఆర్‌టిసి వ్యవహారంపై చెరోదారి
నదుల అనుసంధానంపై ఎపి సొంత బాణి
పలు హామీల అమలు విషయంలోనూ భిన్న వైఖరులు
హైదరాబాద్‌ : తెలంగాణ సిఎం కెసిఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిల మధ్య దూరం పెరుగుతోందా…? అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. జగన్‌ ఎపి సిఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తెలంగాణ సిఎం కెసిఆర్‌తో సన్నిహితంగా మెలిగారు. ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి స్వయం గా హాజరయ్యారు. జగన్‌ తన కొడుకు లాంటి వాడని కెసిఆర్‌ అన్నారు. పలుసార్లు సమావేశమై గోదావరి, కృష్ణా జలాల అనుసంధానంపై చర్చించారు. ఉమ్మడి ఆస్తుల విషయంలోనూ సఖ్యతను కనపరిచారు. హైదరాబాద్‌లోని ఎపి సచివాలయాన్ని , అసెంబ్లీ ప్రాంగణాన్ని ఖాళీ చేసి తెలంగాణకు అప్పగించారు. అదే విధంగా 9వ షెడ్యూల్డ్‌లోని పలు శాఖలు, ఆస్తులపై ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కనబరిచారు. అలాంటిది తాజాగా వీరిద్దరి మధ్య నెలకొన్న పరిస్థితులు ఒక్కసారిగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇద్దరు కలిసి తీసుకున్న కీలక నిర్ణయాల విషయంలో జగన్‌ తన సొంత దారిని ఎంచుకోవడమే దీనికి కారణమంటున్నారు. తెలంగాణ అంతటా ఆర్‌టిసి కార్మికులు చేస్తున్న సమ్మె, వీరికి ఇస్తున్న విపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతుతో ఉద్రిక్త, ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్‌టిసిని ఎపిలో ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా సంబంధిత ప్రక్రియకు కూడా జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇక్కడ కూడా అదే హామీ ఇచ్చిన కెసిఆర్‌ ఆ విషయంలో వెనక్కు తగ్గారు. ఈ విషయంలో జగన్‌ పట్ల కెసిఆర్‌కు ఎంత ఆగ్రహం ఉందో విలేకరుల సాక్షిగా మీడియా సమావేశంలో వెల్లగక్కారు. ఆర్థిక లోటు ఉన్న ఎపిలో ఆర్‌టిసిని విలీనం చేసినప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు అని ఆర్‌టిసి కార్మికులు ప్రశ్నిస్తున్నారని ఒక విలేకరి అడగగా దీనికి కెసిఆర్‌ ఘాటుగా స్పందిస్తూ ‘ ఏం చేసిండు, ఆర్డర్స్‌ తీసిండు, కమిటీ వేసిండు, మూడు,ఆరునెలల్లో ఏదో కథ చెబుతరట, ఏం జరుగుతదో దేవునికే తెలుసు, చూద్దాంగా ఏం జరుగుతుందో, అక్కడ ఓ ప్రయోగం జరిగింది, ఏం మన్న జరగలే, మీకు తెల్వదు’ అన్నారు. ఈ వాఖ్యలకు ఎపి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కూడా ఘాటుగానే స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఆర్‌టిసి విలీనంపై చేసిన వాఖ్యలు మాలో కసిని, పట్టుదలను పెంచాయి, ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని స్పష్టం చేశారు. దీనిని బట్టి జగన్‌, కెసిఆర్‌ల మధ్య దూరం పెరిగిందనే భావనే సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్‌ సిఎం అయిన తొలినాళ్లలో తరచు కలుసుకోవడం, లేదా ఒకరి గూర్చి ఒకరు అక్కడ ఇక్కడా మంచిగా మాట్లాడుకోవడం, తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకోవడం చేశారు. ఇప్పుడు ఈ వాతావరణం కనిపించడం లేదు. అందుకే వీరి మధ్య అంతరం పెరిగిందని విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు. వీరివురు కలిసి అత్యంత కీలకంగా తీసుకున్న నిర్ణయం విషయంలో జగన్‌ తన దారి తాను చూసుకున్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలని ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ ఇంజినీర్లు, నిపుణులతో కమిటీ వేశారు. సమావేశాలు కమిటీ స్థాయిలో పలుసార్లు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఒకటి రెండు సార్లు చర్చించారు. నాలుగైదు ప్రతిపాదనలు చేశారు. దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌కు అక్కడి నుంచి రాయలసీమకు గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనను తెలంగాణ చేసింది. ఈ విషయంలో ఎపిలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అభ్యంతరం తెలిపింది. తెలంగాణ భూభాగంలో మన డబ్బులను వెచ్చిస్తే భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు. జగన్‌ కూడా అదే అసెంబ్లీ వేదికగా స్పందించి నదుల అనుసంధాన నిర్ణయాన్ని సమర్థించారు. ఏ వ్యవహారమైనా ఒప్పందాలు, నియమాలు, నిబంధనల మధ్యే జరుగుతాయని కౌంటర్‌ ఇచ్చారు. ఇంతటి కీలక విషయంలో జగన్‌ ఉన్నట్టుండి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. గోదావరి జలాలలను కృష్ణాకు తరలించే విషయంలో సొంత రూట్‌ను ఎంచుకున్నట్లు తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పోలవరం నుంచి కాల్వ ద్వారా నాగార్జున సాగర్‌ కుడి కాలువకు నీరు అందించేలా ఒక పెద్ద పథకాన్ని రూపొందించారు. దీని కోసం గుంటూరులో 150 టిఎంసిల సామర్థ్యంతో పెద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం, పలు ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని నిర్ణయించారు. దీనికి దాదాపు 60వేల కోట్ల ఖర్చవుతాయన్న ప్రాథమిక అంచనా కూడా వేశారు. ఇరువురు సిఎంలు కలిసి తీసుకున్న తొలి నిర్ణయంలోనే జగన్‌ వెనక్కు పోతుండడం వారి మధ్య అగాథాన్ని పెరుగుతోందనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు ఏపథకమైనా, ఏ నిర్ణయమైనా సరే తనతోనే ఇతర రాష్ట్రాలు, దేశాలు పోల్చుకోవాలని, అలాగే చేస్తున్నాయని మిషన్‌ భగీరథ, రైతు బంధు ఇలా ఎన్నింటినో గొప్పగా చెప్పుకునే కెసిఆర్‌ను ఇప్పుడు తెలంగాణలో జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో పోలుస్తూ అవి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించే పరిస్థితులు రావడం కూడా వీరి మధ్య అంతరం పెరగుతండడానికి ఒక కారణమని పరిశీలకు అంటున్నారు. ఉదహరణకు పరిశీలిస్తే తొలుత ఏపిలో జగన్‌ అధికారంలోకి రాగానే ఇదే ఆర్‌టిసికి 43శాతం వేతన సవరణ చేస్తే ఇక్కడ కెసిఆర్‌ ఒక శాతం పెంచి 44శాతం చేశారు. అంతే కాదు ఈ విషయంలో తామే బెటర్‌ అని చెప్పుకున్నారు. అయితే వెనువెంటనే అక్కడ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడ కెసిఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం మొదలుపెట్టాయి. అక్కడ ఉద్యోగులకు జగన్‌ 27 శాతం ఐఆర్‌( మధ్యంతర బృతి) ప్రకటించారు. కెసిఆర్‌ ఐఆర్‌ ఇస్తానని చెప్పి ఏడాది గడిచినప్పటికి ఇవ్వకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక మంత్రి హరీష్‌రావ్‌ చేత ఇక ఐఆర్‌ లేదు, ఏకంగా పిఆర్‌సినే ఇస్తామని ప్రకటింప చేశారు. అయినప్పటికి ఇప్పటి వరకు ఐఆర్‌, పిఆర్‌సి రెండు లేవు. ఉద్యోగులంతా కంట్రిబ్యూటర్‌ పెన్షన్‌ పథకాన్ని(సిపిఎస్‌) రద్దు చేయాలని రెండు రాష్ట్రాల్లోనూ డిమాండ్‌ చేస్తున్నారు. జగన్‌ వెంటనే స్పందించి అక్కడ సిపిఎస్‌ను రద్దు చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు దీనిపై కెసిఆర్‌ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగుల పదవి విరమణ వయోపరిమితి పెంపులోనూ ఇదే జరిగింది. ఇలా జగన్‌ తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాలు కెసిఆర్‌ను తెలంగాణలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య అగాథం రోజురోజుకు మరింత పెరుగుతుందనే భావనే రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments