రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం
రాజ్‌భవన్‌లో కెసిఆర్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్
మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణం
రేపోమాపో కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గం
ప్రజాపక్షం / హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గురువారం కెసిఆర్‌తో గవర్నర్ ఇ.ఎల్‌ఎన్. నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. కెసిఆర్‌తో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి, ఎంఎల్‌సి మహ్మద్ మహముద్ అలీ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి సిఎం కెసిఆర్ నమస్కారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ రెండోసారి సిఎంగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెసిఆర్ కుటుంబ సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంఎల్‌సి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బిజెపి ఎంఎల్‌ఎ టి.రాజాసింగ్ పాల్గొన్నారు. దైవసాక్షిగా కెసిఆర్ ప్రమాణం :“కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని “దైవసాక్షి”గా ప్రమాణం చేస్తున్నాను” అంటూ కెసిఆర్ ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ కుటుంబంతో కెసిఆర్ కుటుంబ సభ్యులు, మహముద్ అలీ ఫ్యామిలీ కలిసి ప్రత్యేక ఫోటో దిగారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టడంతో పార్టీ నేతలు, ఎంఎల్‌ఎలు అత్యంత ఉత్సాహంగా సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో నాలుగైదు రోజుల్లో మంత్రివర్గాన్ని విస్తరించాలని సిం కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం కెసిఆర్ ప్రగతిభవన్‌కు వెళ్లారు. ప్రగతిభవన్‌లో సిఎంను పలువురు మాజీ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, డిజిపి మహేందర్ రెడ్డి, సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రముఖులు అభినందించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసిఎల్) సిఎండి గౌరవరం రఘుమా రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టిఎస్‌ఎణపిడిసిఎల్ ) సిఎంఎండి అమ్మినేని గోపాల్‌రావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్ లు, సీనియర్ అధికారులు సిఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
విద్యుత్ అధికారులకు అభినందన
ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు, ఇతర రంగాలకు కల్పిస్తున్న నిరంతరాయ విద్యుత్ సరఫరాపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేసి సంబంధిత అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమం అమలు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న విద్యుత్ సంస్థల అధికారులను, సిబ్బందిని మెచ్చుకున్నారు. భవిష్యతులో సైతం ఇదే విధంగా పని చేస్తూ రాష్ట్రంలోని ప్రజలందరి అభిమానం చూరగొని జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యుత్ సంస్థలుగా నిలవాలని సిఎం సూచించారని సిఎండి జి.రఘుమా రెడ్డి తెలిపారు.