HomeNewsBreaking Newsకెసిఆర్‌కు ఎలక్ట్రిక్‌ బస్సుల షాక్‌

కెసిఆర్‌కు ఎలక్ట్రిక్‌ బస్సుల షాక్‌

మిత్రుడు ‘మేఘా’ కృష్ణారెడ్డికి రూ.40కోట్ల లబ్ధి; బట్టబయలు చేసిన డిసి
ఆర్‌టిసి కార్మిక సమ్మె అణచివేత ఆంతర్యం ప్రైవేటీకరణ అనే ఆరోపణకు బలం
డిసి కధనం ఇలా వుంది
హైదరాబాద్‌, అక్టోబరు 13 : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు సన్నిహితుడైన మేఘా కృష్ణారెడ్డికి, రాష్ట్రానికి కరెంటు బస్సులు సరఫరా చేయటానికి ప్రభుత్వం ఎంచుకున్న ఒలిక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఉన్న సంబంధాన్ని ప్రస్తుతం జరుగుతున్న ఆదాయపు పన్ను సోదాలు బయటకు తీశాయి. ఒలిక్ట్రా గ్రీన్‌టెక్‌ 40 ఎలక్ట్రిక్‌ బస్సులు సరఫరా చేసింది. ఒక్కొక్క బస్సు ఖరీదు రమారమీ రూ. 2 కోట్లు. అందులో ఒక కోటి రూపాయలు కేంద్రప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది. మిగతా సొమ్మును రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తుంది. ఒలిక్ట్రా విషయంలో, ఆ సబ్సిడీ టిఎస్‌ఆర్‌టిసి వెళ్లకుండా ఒలిక్ట్రా గ్రీన్‌టెక్‌కు వెళ్లింది. ఆ కంపెనీ కృష్ణారెడ్డికి చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌(ఎంఇఐఎల్‌ మీల్‌) సొంతం. అది హాయిగా రూ.40 కోట్లు జేబులో వేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో ఇది ఆసక్తిదాయకం. ప్రభుత్వం సమెపై విరుచుకుపడటం, 48 వేలమంది ఉద్యోగులను తొలగించటంలోని అసలు ఉద్దేశం ఆర్‌టిసిని ప్రైవేటీకరించి దాని ఆస్తులను టిఆర్‌ఎస్‌ ఉన్నత నాయకత్వానికి సన్నిహితంగా ఉన్న కంపెనీలకు అప్పగించాలన్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆకాంక్ష అని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అనేక ఆరోపణలు చేశాయి. ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల వ్యవహారం అటువంటి భయాలను ధృవీకరిస్తున్నది. ట్రినిటి ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు చెందిన ఒక కోటి ఈక్విటీ షేర్లను మీల్‌ 2018 ఆగస్టు 10న రు.650 కోట్లకు కొనుగోలు చేసి కంపెనీని స్వాధీ నం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను సోదా వెల్లడించింది. ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ ‘గోల్డ్‌స్టోన్‌’ ప్రసాద్‌కు చెందినది. అతడు మియాపూర్‌ భూ కుంభకోణలో ప్రధాన నిందితుడు. ప్రసాద్‌ గోల్డ్‌స్టోన్‌ పవర్‌ ప్రమోటర్‌ కూడా. ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్‌ను స్వాధీనం చేసుకోవటం ద్వారా రెడ్డిగారి మీల్‌ గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ అనే అసోసియేటెడ్‌ కంపెనీలో 50 శాతం వాటా సంపాదించింది. ఆ కంపె నీ పేరును అటు తర్వాత, మీల్‌ ప్రవేశించిన తదుపరి ఒలిక్ట్రా గ్రీన్‌టెక్‌గా మార్చినట్లు డక్కన్‌ క్రానికల్‌ సంపాదించిన పత్రాలు తెలుపుతున్నా యి. ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు కాంట్రాక్టును టిఎస్‌ఆర్‌టిసి తరఫున మీల్‌ గ్రీన్‌టెక్‌కు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇవ్వటం ఈ ఒప్పందాన్ని లాభసాటి చేసింది. ఒలిక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు, ఆటోలు తయారు చేస్తుంది. దాని ఫ్యాక్టరీ పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జడ్చర్ల వద్ద ఉంది. ఈ ఒప్పందం తొలి దశలో మీల్‌ 40 బస్సులు సరఫరా చేసింది. భారతదేశంలో ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఎఫ్‌ఎఎంఇ పథకం కింద కేంద్రానికి రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనను అనుసరించి ఈ బస్సులు కొన్నారు. ఈ పథకం రెండవ దశలో 334 ఎలక్ట్రిక్‌ బస్సులను కొంటారు. స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద వాటిలో 309 గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు, మిగతావి వరంగల్‌కు ఉద్దేశించాయి. ఒలిక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌లో 50శాతం కంట్రోలును మీల్‌ తీసుకున్నట్లు ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు తెలియజేస్తున్నాయి. మీల్‌లో డైరెక్టర్లుగా ఉన్న రెడ్డివారి కుటుంబ సభ్యులు ట్రినిటీ బోర్డులో ప్రవేశించినట్లు కూడా అవి తెలిపాయి. పామిరెడ్డి పిచ్చిరెడ్డి(మీల్‌లో పూర్తికాలం డైరెక్టర్‌), రామారెడ్డి పామిరెడ్డి, ఇతర బంధువులు ట్రినిటీ బోర్డులో నాన్‌ సభ్యులుగా ఉన్నారు. ఒలిక్ట్రా లో మీల్‌కు 50శాతం గాక, ప్రసాద్‌ కుటుంబానికి 38 శాతం వాటా, మిగతాది పబ్లిక్‌కు ఉన్నట్లు గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ కుటుంబ సన్నిహితులు తెలియజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments