ప్రాంతీయ పార్టీలను అస్థిర పర్చేందుకు బిజెపి యత్నం
మునుగోడు ఉప ఎన్నికలో ముందు వరుసలో టిఆర్‌ఎస్
“మీట్ ది ప్రెస్”లో మంత్రి జగదీశ్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రధానంత్రి నరేంద్ర మోడీపై ప్రజల్లో ఉన్న ఆధరణ పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో దేశ వ్యాపితంగా ఆదరణ పెరుగుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేసేందుకు బిజెపి కుట్ర చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ 14 నుండి 18 శాతం ముందు వరుసలో ఉన్నదని, బిజెపి, కాంగ్రెస్ సమానంగా రెండవ స్థానం కోసం పోటీపడుతున్నాయన్నారు. సొంత పార్టీనే జోడించేలేని వారు, ఇక భారత్‌ను ఏం జోడిస్తారని, భారత్ జోడో యాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో ప్రెస్‌క్లబ్‌లో శనివారం “మీట్ ది ప్రెస్” నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రాంతీయ పార్టీలను అస్థిరతపర్చే కుట్రలకు బిజెపి తెర లేపిందని మండిపడ్డారు. కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిహద్దు రాష్ట్రాలను దాటుకుంటూ ఢిల్లీ, కశ్మీర్ వరకు చేరాయని, ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో సహా బిజెపి ఏలుబడి రాష్ట్రాలలో కూడా కెసిఆర్, టిఆర్‌ఎస్‌పైన చర్చ జరుగుతోందని, ఇది బిజెపికి కంటగింపుగా మారిందన్నారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంతో కమలనాథులకు వణుకు మొదలైందన్నారు. బిజెపి రాజకీయ క్రీడలో భాగంగా తన స్వార్థం కోసం రాజగోపాల్‌రెడ్డి ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గం కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్‌కు కొత్త కాదని, ఈ నియోజకర్గంలో కెసిఆర్ నిద్ర చేసినప్పుడు రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లోనే లేరని, ఆయనకు అవగాహన లేనట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. మునుగోడులో కొత్తగా పర్యటించేది అమిత్ షా, నడ్డా, బిజెపికి చెందిన కేంద్రమంత్రులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో ఓడిపోతే పదవి నుంచి తీసివేస్తారనే భయం రేవంత్ రెడ్డికి పట్టుకుందని ఎద్దేవా చేశారు.
నాడు 400 మంది అభ్యర్థులున్నా… ధర్మభిక్షాన్నే గెలిపించారు..
గతంలో మునుగోడు నియోజకవర్గంలో నాలుగు వందల మంది నామినేషన్లను వేసినప్పటికీ 290 క్రమ సంఖ్యలో ఉన్న నాటి సిపిఐ నాయకులు ధర్మభిక్షాన్నే ప్రజలు గెలిపించారని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. కారు గుర్తును పోలిన గుర్తులు ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు అనేక ఉద్యమాలను చూసిన నల్లగొండ జిల్లా ప్రజలు కోవర్ట్‌ల పని పట్టారని, ఇప్పుడూ రాజగోపాల్‌రెడ్డి పని పడుతారన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో ప్రమాదకర శక్తిగా ఎదుగుతున్న బిజెపిని నిలువారించాలన్నదే వామపక్షాల అభిమతమని, మనువాద పాలన కోసం ప్రయత్నిస్తున్న బిజెపిని అడ్డుకోవాలని వామపక్షాలు జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ముందుకు సాగుతున్నామని, మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించే శక్తి టిఆర్‌ఎస్‌కే ఉన్నందునే వామపక్షాలు తమకు మద్దతునిచ్చాయని మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. తమ ఓట్లతో గెలిచినందుకే ఎంఎల్‌ఎ రాజగోపాల్‌రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ లభించిందని, పైగా ఆయన విస్తృతంగా డబ్బులు పంచుతున్నందున, ఎందుకు తీసుకోవద్దనే ఆలోచనలో కూడా కొందరిలో ఉన్నదని మంత్రి తెలిపారు
సాధారణ ఎన్నికలపైన మునుగోడు ప్రభావం
సాధారణ ఎన్నికలపై మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం ఉంటుందని, ఎన్నికల ఫలితాలు ఎప్పటికైనా ప్రభుత్వ పనికి గీటు రాయేనని జగదీశ్ రెడ్డి అన్నారు. గడిచిన నాలుగేళ్లుగా మునుగోడులో సమస్యలు పేరుకుపోవడానికి కారణమే రాజగోపాల్‌రెడ్డి నిర్లక్ష్యమని ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాధి ముబారక్ చెక్‌లను నిర్ణీత సమయంలో లబ్ధిదారులకు అందజేయలేకపోయారని గుర్తు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో వాటిని రెన్యూవల్ చేసి లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఫ్లోరోసిస్ శాశ్వత నివారణకు వరద కాలువలే పరిష్కరమన్నారు. డిండి ఎత్తిపోతల పథకంతో సహా చర్లగుడెం, శివన్నగూడెం,లక్ష్మపురం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని జగదీశ్ రెడ్డి తెలిపారు.
కెసిఆర్‌ను రాష్ట్రానికే పరిమితం చేసే కుట్ర
RELATED ARTICLES