గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్
లీడర్స్ సమావేశానికి ఆహ్వానం
ప్రజాపక్షం/హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం పంపింది. కీపింగ్ పేస్ టెక్నాలజీ- గవర్నెన్స్ ఎట్ క్రాస్ రోడ్స్ పేరుతో జరిగిన ఈ సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్రంలోని ప్రభుత్వ పాలసీ నిర్ణయించే సీనియర్ మంత్రులు వంటి వారు మాత్రమే సాధారణంగా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇలాంటి సదస్సుకు కెటిఆర్‌కు ఆహ్వానం రాగా మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్‌కు ప్రత్యేక బ్యాడ్జ్ ను అందించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సమావేశం ప్రపంచ లీడర్లందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వివిధ అంశాలపైన మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, సీనియర్ కేంద్ర మంత్రులను ఆహ్వానించింది. సెర్బియా ప్రధానమంత్రి అనా బ్రనాబి, పోలాండ్ ప్రధాని మతేస్జ్ మోరావిక్కీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేషియా, బోట్స్ వానా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.